మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 02:30:41

3 దేశాల విజయసూత్రం

3 దేశాల విజయసూత్రం

  • కరోనా కట్టడికి న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, ఉగాండా విధానాలు ఉత్తమం 
  • వీటి ఆధారంగా దేశాలు వ్యూహాలు రూపొందించుకోవాలి 
  • తాజా అధ్యయనం సిఫార్సు 

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ చేపట్టిన టెస్టింగ్‌ పాలసీ, డెన్మార్క్‌ రూపొందించిన పాఠశాల విధానం, ఉగాండా అనుసరించిన కమ్యూనికేషన్స్‌ స్ట్రాటజీని కలగలిపితే కరోనాను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గం అవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి కట్టడిలో ఆయా దేశాలు అనుసరించిన విజయవంతమైన పద్ధతులపై పరిశోధకులు మైఖెల్‌ బార్బర్‌, ఇడ్రిస్‌ జాలా అధ్యయనం జరిపారు. బ్రిటన్‌ పూర్వ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు మైఖెల్‌ సలహాదారు కాగా, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌కు ఇడ్రిస్‌ సలహాదారు. న్యూజిలాండ్‌, దక్షిణకొరియా, డెన్మార్క్‌, ఉగాండా తదితర దేశాలు అనుసరించిన పద్ధతులను వీరు విశ్లేషించారు.

ఒక్కో దేశంలో ఒక్కో మార్గం 

కరోనా కట్టడికి న్యూజిలాండ్‌ విస్తృతంగా పరీక్షలు నిర్వహించింది. సగటున ఒక పాజిటివ్‌ కేసుకు 7000 పరీక్షలు చేపట్టింది. ఇక దక్షిణకొరియా.. సెక్యూరిటీకెమెరాలు, క్రెడిట్‌ కార్టుల లావాదేవీల సమాచారం ఆధారంగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను చేపట్టింది. ఇంటర్నెట్‌ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉన్న ఉగాండాలో అక్కడి ప్రభుత్వం రేడియో కార్యక్రమాల ద్వారా కరోనాపై ఎలా పోరాడాలో తెలుపుతూ ప్రజలకు చేరువైంది. పాఠశాలలను తిరిగి తెరువడంలో డెన్మార్క్‌ అనుసరించిన విధానం ఉత్తమమని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఆయా దేశాల విధానాలు అన్ని చోట్లా అనుసరణీయం కాకపోవచ్చని చెప్పా రు. ఉదాహరణకు దక్షిణకొరియాలాగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం పలు దేశాల్లో నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.

నాటితో పోల్చితే నేడు సమన్వయం తగ్గింది 

2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటితో పోలిస్తే, కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కొరవడిందని చెప్పారు. కరోనా ప్రభావం, ఆ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య ఆధారంగా వీరు ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయించారు. రికవరీలో థాయ్‌లాండ్‌, దక్షిణకొరియా టాప్‌లో ఉండగా, హొండురాస్‌, బహమాస్‌ అట్టడుగున ఉన్నాయి. మొత్తం 184 దేశాల్లో భారత్‌ 84, బ్రిటన్‌ 28, అమెరికా 131వ స్థానంలో ఉన్నాయి.


logo