గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 01:59:27

గుమ్నామీ బాబా అంశంలో కొత్త ట్విస్ట్‌

గుమ్నామీ బాబా అంశంలో కొత్త ట్విస్ట్‌
  • ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ ఫలితాలు లేవన్న సీఎఫ్‌ఎస్‌ఎల్‌

కోల్‌కతా: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌గా కొంతమంది భావిస్తున్న గుమ్నామీ బాబా అంశం మరోమారు చర్చనీయాంశమైంది. బాబా దంతాలపై జరిపిన ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ ఫలితాల వివరాలు తమ దగ్గరలేవని కోల్‌కతాలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్‌) తాజాగా వెల్లడించింది. మనిషి డీఎన్‌ఏను క్రమపద్ధతిలో ఆవిష్కరిస్తూ.. కచ్చితమైన ఫలితాల కోసం ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నేతాజీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు గుమ్నామీ బాబాగా చలామణి అయ్యారని కొందరి వాదన. చివరిదశలో నేతాజీ ఏమయ్యారోనన్న అంశంపై సాయక్‌సేన్‌ అనే ఔత్సాహికుడు పలు వివరాల్ని సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో గుమ్నామీ బాబా దంతాలకు సంబంధించిన ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ ఫలితాల వివరాల్ని కోరుతూ సమాచారహక్కు చట్టం ద్వారా సీఎఫ్‌ఎస్‌ఎల్‌, కోల్‌కతా అధికారిని వివరాలు అడిగాడు. దీనిపై స్పందించిన సీఎఫ్‌ఎస్‌ఎల్‌ పౌర సమాచార అధికారి.. గుమ్నామీ బాబాకు సంబంధించిన ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ ఫలితాలు తమవద్ద లేవని తెలిపారు. 


అయితే, సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారుల సమాధానంపై సాయక్‌సేన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్నామీ బాబా.. నేతాజీ కాదని పేర్కొన్న జస్టిస్‌ విష్ణు సహాయి కమిషన్‌ నివేదికను సమాధానంతోపాటు ప్రత్యుత్తరంలో పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబాపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చేసిన పరీక్షలను డీఎన్‌ఏ నిపుణులు మరోసారి పరీక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆగస్టు 18, 1945లో తైవాన్‌లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో బోస్‌ అమరుడయ్యాడని ప్రభుత్వం చెబుతుండగా.. బ్రిటిషర్ల నుంచి తప్పించుకున్న బోస్‌.. గుమ్నామీ బాబాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో కొంతకాలం గడిపారని, సెప్టెంబర్‌ 16, 1985లో ఆయన మరణించారని కొందరు నమ్ముతున్నారు.


logo
>>>>>>