బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 17:49:08

ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు

ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు

గోపాల్ గంజ్ : మొన్నటి వంతెన కూలిపోయిన ఘటన మరిచిపోకముందే.. మరో అప్రోచ్ రోడ్డుకు వరద నీటిలో కొట్టుకుపోయింది. గమ్మత్తు విషయం ఏంటంటే.. సీఎం నితీష్ కుమార్ ప్రారంభించడానికి ముందే ఈ వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. 

గోపాల్‌గంజ్‌లో నిర్మించిన బంగారఘాట్ వంతెనను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. వంతెన ప్రారంభోత్సవం ఉదయం 11:30 గంటలకు జరగాల్సి ఉంది. అంతకుముందు మంగళవారం రాత్రి 12:30 గంటలకు వంతెన యొక్క అప్రోచ్ రోడ్ వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు 50 మీటర్ల రహదారి కూలిపోయింది. వంతెనను ప్రారంభించడానికి 30 నిమిషాల ముందు అప్రోచ్ రోడ్డుకు అధికారులు మరమ్మతులు పూర్తిచేశారు. బిహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. రహదారి కొట్టుకుపోయిన ప్రాంతం సరన్ లోని సత్జోడా బజార్ సమీపంలో ఉంది.

2014 ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 509 కోట్ల వ్యయంతో రాజపట్టి వద్ద మహాసేతు ప్రాజెక్టుకు పునాది వేశారు. వంతెన ఆరంభించడంతో 6 జిల్లాల్లో సుమారు 8 లక్షల జనాభా కదలికలు సులభతరం అవుతాయి. ఇది గోపాల్‌గంజ్, సివాన్, సరన్ నుంచి ముజఫర్‌పూర్‌కు 55 కిలోమీటర్లు, దర్భంగను 65 కిలోమీటర్లకు, జనక్‌పూర్‌కు 70 కిలోమీటర్ల దూరం తగ్గిస్తుంది. ఇలాఉండగా, అవినీతి కారణంగానే ప్రజలకు ఉపయోగపడాల్సిన వంతెనలు, రోడ్లు నీటిలో కొట్టుకుపోతున్నాయని ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది. సమగ్ర దర్యాప్తు జరుపాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.


logo