మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 02:00:05

దేశంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు

దేశంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు

  • మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై  ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాలు
  • కళాశాలను రెండు విభాగాలుగా  వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటుచేయొచ్చు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31: దేశంలో మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే దవాఖానల స్థాపనకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నూతన నియమావళిని విడుదల చేసింది. మెడికల్‌ కళాశాల, దవాఖాన స్థాపనకు కచ్చితంగా ఐదెకరాల భూమి ఉండాలన్న నియమాన్ని రద్దుచేసింది. నైపుణ్యాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది. అనుబంధ దవాఖానల్లో పడకల సంఖ్యను కూడా కుదించింది. ఎంసీఐ 1999లో తెచ్చిన ‘మెడికల్‌ కాలేజీల్లో కనీస సౌకర్యాలు’ అనే నియమావళిని పూర్తిగా రద్దుచేసింది. కొత్త నియమాలు 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.  

కొత్త నియమావళిలో కీలకాంశాలు

  • మెడికల్‌ కళాశాల, అనుబంధ దవాఖాన స్థాపనకు కచ్చితంగా ఐదెకరాల భూమి ఉండాల్సిన అవసరం లేదు. 
  • దేశంలోని మొదటి, రెండో స్థాయి నగరాలు, ఈశాన్య రాష్ర్టాల్లోని కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాల్లో మెడికల్‌ కళాశాల స్థాపనకు అవసరమైన భూమి మొత్తం ఒకే చోట ఉండాల్సిన అవసరంలేదు. రెండుచోట్ల ఉన్నా సరిపోతుంది. అయితే ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం పది కిలోమీటర్లు మించకూడదు. 
  • 200 మంది విద్యార్థులుండే కాలేజీలో ల్యాబోరేటరీ కనీసం 800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి.   
  • వంద సీట్లున్న మెడికల్‌ కళాశాలకు చెందిన అనుబంధ దవాఖానలో కనీస పడకల సంఖ్యను 430కి తగ్గించారు.