సోమవారం 26 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 21:38:49

బిహార్‌ రాజకీయాల్లోకి కొత్త నేత.. పుష్పమ్‌ ప్రియా చౌదరి

 బిహార్‌ రాజకీయాల్లోకి కొత్త నేత.. పుష్పమ్‌ ప్రియా చౌదరి

పాట్నా : బిహార్‌ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చి తనను తాను భవిష్యత్ ముఖ్యమంత్రిగా పిలుచుకోవడం ద్వారా బిహార్‌ రాజకీయాల్లో కొత్త నేత అవతరించారు. ఎప్పుడూ నల్లటి దుస్తులు ధరించే పుష్పమ్ ప్రియా చౌదరి ఇటీవల ప్లూరల్స్ పార్టీని ప్రారంభించి రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. పుష్పమ్‌ రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వాటిలో ఒకటి పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బరిలో నిలిచే రెండో అసెంబ్లీ సీటును ఇంకా వెల్లడించలేదు. 

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన సమాచారం ఇస్తూ, 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్, సస్సెక్స్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్‌ డిగ్రీ చదివాను. ముఖ్యమైన విషయాలపై ఇంటెన్సివ్ స్టడీ చేశాపే. అభివృద్ధి చెందిన సమాజం కోసం విధాన రూపకల్పన జరిపాను. 241 మంది సహచరులతో బిహార్ ఎన్నికల బరిలో తమ పార్టీ ప్లూరల్స్‌ దిగనున్నది. 2025 నాటికి బిహార్‌ను దేశంలో నంబర్‌వన్‌గా.. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటిగా తయారుచేయాలని నిశ్చయించుకున్నాను' అని తెలిపారు.

నితిష్‌, లాలూకు సవాలు 

పుష్పమ్‌ ప్రియా చౌదరి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో పాటు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బంకీపూర్ సీటు నుంచి పోటీ చేయాలని జేడీయూ, ఆర్జేడీకి సవాలు విసిరారు. ఆయా పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇక్కడి నుంచి నిలబెట్టి 15 సంవత్సరాల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపాలని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోరారు. పుష్పమ్ ప్రియా చౌదరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత.. బంకీపూర్ నుంచి ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నది అనే ప్రశ్నలు తలెత్తాయి. పుష్పమ్ పార్టీ 'ప్లూరల్స్‌' అభ్యర్థులు పార్టీ పేరు లేదా గుర్తుపై పోటీ చేయలేరని సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు పుష్పం ప్రియ పార్టీ ఎన్నికల సంఘం వద్ద నమోదు కాలేదు. పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నది. అక్టోబర్ 8వ తేదీలోగా ప్లూరల్స్‌ పార్టీ నమోదుపై అభ్యంతరాలు వ్యక్తం కానిపక్షంలో అక్టోబర్ 9 న ఆటోమెటిక్‌గా నమోదవుతుంది.


logo