గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 02:59:02

పార్లమెంటుకు కొత్తభవనం

పార్లమెంటుకు కొత్తభవనం

  • ఇప్పటిది పాతబడింది 
  • భద్రతా లోపాలున్నాయి
  • ఫైర్‌ సేఫ్టీ కూడా లేదు
  • సభ్యులు పెరిగితే కష్టం
  • సుప్రీంకు కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంటు భవనం పురాతనమైనదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదని అందులో పేర్కొన్నది. 100 ఏండ్లు పైబడిన ఈ భవనంలో సాంకేతిక సమస్యలతో పాటు భద్రతాపరంగా లోపాలున్నాయని తెలిపింది. పార్లమెంటు భవనం అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని, అగ్ని ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ‘సెంట్రల్‌ విస్తా రెనోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు’లో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి కేంద్రం సంకల్పించగా.. ప్రాజెక్టు అవశ్యకతను సవాలు చేస్తూ నిఖిల్‌ సూరి అనే లాయర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్‌ సమర్పించింది. మోదీ ప్రభుత్వం దాదాపు రూ. 1000 కోట్లతో  కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నది. త్రికోణాకృతిలో నిర్మించనున్న ఈ భవనాన్ని 2022 అగస్టు 15 లోపు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

2026లో పెరగనున్న సీట్లు

ప్రస్తుతం లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 545. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. 2026లో డీలిమిటేషన్‌ తర్వాత ఉభయసభల్లో మొత్తం సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. అప్పటికి లోక్‌సభ సీట్ల సంఖ్య 876కు పెరగవచ్చని కేంద్రం అంచనావేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భవనం కార్యకలాపాలకు సరిపోదని కేంద్రం పేర్కొన్నది. కొత్త భవనం అవసరమని సుప్రీం కోర్టుకు తెలిపింది. 

1921లో నిర్మాణం

ప్రస్తుత పార్లమెంటు భవన నిర్మాణాన్ని 1921లో  బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. దీనికి ఎడ్విన్‌ ల్యూటెన్స్‌, హెర్బర్ట్‌ బేకర్‌ డిజైన్‌ చేశారు. 1927 జనవరి 18న ప్రారంభమైన నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి వైశ్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ శంకుస్థాపన చేశారు. 1937లో నిర్మాణం పూర్తైంది. ఇది 6 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. తర్వాతి కాలంలో పార్లమెంటు కార్యకలాపాలు పెరిగాయి. 1956లో మరో రెండు అంతస్తులు పెంచారు. 


logo