సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 00:47:44

ఉద్యోగ సృష్టికర్తలే లక్ష్యం!

ఉద్యోగ సృష్టికర్తలే లక్ష్యం!

  • ఎన్‌ఈపీతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు 
  • జీవితానికి సాయపడే విద్యను అందించడమే దీని ధ్యేయం 
  • స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావడమే లక్ష్యంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ-2020) తీసుకువచ్చినట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ కొత్త విద్యావిధానం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారు తయారు అవుతారని పేర్కొన్నారు. ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020’ ఫినాలే కార్యక్రమంలో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పరస్పర ఆధారిత నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులు తాము నేర్చుకోవాలనుకుంటున్న వాటిపైనే దృష్టిసారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ‘ఎన్‌ఈపీ కేవలం ఒక డాక్యుమెంట్‌ కాదు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. తమకు ఇష్టంలేని సబ్జెక్టులను ఆధారంగా చేసుకొని తమ సామర్థ్యాల్ని అంచనా వేస్తున్నట్టు చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు. ఆసక్తి లేకపోయినప్పటికీ, కుటుంబసభ్యులు, మిత్రుల ఒత్తిడితో ఆయా సబ్జెక్టులను వాళ్లు చదువుతున్నారు. అందుకే విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టటానికే నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చాం’ అని చెప్పారు. 21వ శతాబ్దం యువతను దృష్టిలో పెట్టుకొని ఎన్‌ఈపీ-2020ను తీసుకొచ్చినట్టు తెలిపారు. ‘21వ శతాబ్దం విజ్ఞాన భాండాగారం వంటిది. నేర్చుకోవడం, పరిశోధించడం, ఆవిష్కరించడం అనే మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. సరిగ్గా ఎన్‌ఈపీ అదే చేస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ విధానం లక్ష్యం’ అని మోదీ తెలిపారు. బరువైన పాఠశాల సంచీలకు స్వస్తి చెప్పి జీవితానికి సాయపడే విద్యను అందించడమే ఎన్‌ఈపీ ముఖ్య ధ్యేయమని పేర్కొన్నారు. స్థానిక భాషలకు ఎన్‌ఈపీలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అవి కూడా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏమిటీ ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌'

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌' కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించింది. ఏటా ఇది జరుగుతుంది. ప్రజల దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సులువుగా పరిష్కారాలు చూపే ఆవిష్కరణలకు విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.


logo