శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:08:09

స్టార్‌ ప్రచారకుడు.. పదవి కాదు హోదా కాదు: కమల్‌నాథ్‌

స్టార్‌ ప్రచారకుడు.. పదవి కాదు హోదా కాదు: కమల్‌నాథ్‌

భోపాల్‌: స్టార్‌ ప్రచారకుడు అనేది ఒక పదవి కాదు హోదా కాదని మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ అన్నారు. ఆయన స్టార్‌ క్యాంపైనర్‌ హోదాను రద్దు చేసినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం ప్రకటించడంపై శనివారం ఈ మేరకు స్పందించారు. అయితే ఈసీ నిర్ణయంపై తాను ఇప్పుడు వ్యాఖ్యానించబోనని అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నవంబర్‌ 10 తర్వాత దీని గురించి మాట్లాడతానని కమల్‌నాథ్ చెప్పారు. బహిరంగ అంశాలన్నీ చివరకు అందరికీ తెలుస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల దాబ్రాలో కాంగ్రెస్ ‌అభ్యర్థి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్‌నాథ్‌, బీజేపీ అభ్యర్థిని ఇమర్తి దేవిని ‘ఐటమ్‌’గా అభివర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగించింది. మధ్యప్రదేశ్‌సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దీనిపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మరోవైపు బీజేపీ నేతలు కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయగా కమల్‌నాథ్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఆయన ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన స్టార్ ‌ప్రచారకర్త హోదాను రద్దు చేసింది. ఇకపై కమల్‌నాథ్‌ నిర్వహించే ప్రచార వ్యయం సంబంధిత అభ్యర్థి ఎన్నికల వ్యయం కిందకు వస్తుందని పేర్కొంది. మరోవైపు ఈసీ నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తామని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.