శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 04:25:16

నీట్‌, జేఈఈ మళ్లీ వాయిదా

నీట్‌, జేఈఈ మళ్లీ వాయిదా

సెప్టెంబర్‌ 1-6 మధ్య జేఈఈ మెయిన్‌ 

13న నీట్‌.. 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 

కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వశాఖ ఆదేశాలు 

నవంబర్‌ నెల చివరలో తరగతులు! 

న్యూఢిల్లీ, జూలై 3: జాతీయ స్థాయిలో మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే నీట్‌, జేఈఈని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మరోసారి వాయిదా వేసింది. దేశంలో కొవిడ్‌-19 మరింతగా విస్తరిస్తుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను సెప్టెంబర్‌ నెలకు వాయిదా వేస్తున్నట్టు హెచ్చార్డీ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌ సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌ను అదే నెల 27న నిర్వహిస్తారు. నీట్‌ సెప్టెంబర్‌ 13న జరుగనుందని హెచ్చార్డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. గతంలో సవరించిన షెడ్యూల్‌ ప్రకారం నీట్‌ ఈ నెల 26న, జేఈఈ మెయిన్‌ పరీక్ష 18నుంచి 23 వరకు జరుగాల్సి ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆగస్టు 23న జరుగాల్సి ఉండగా అన్ని పరీక్షలను వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ పిటిషన్లు, ట్విట్టర్‌ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. నీట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమాసియాకు చెందిన దాదాపు 4000 మంది ఎన్నారైలు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు 9 లక్షల మంది, నీట్‌కు 16 లక్షల మంది దరఖాస్తు చేశారు. దేశంలో చాలాచోట్ల ఈ పరీక్షల కేంద్రాలు కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నందున పరీక్షలను వాయిదా వేయటమే మంచిదని భావిస్తున్నామని హెచ్చార్డీశాఖ అధికారులు తెలిపారు. 


logo