సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 16:45:51

కలల సాకారానికి గోవండీ స్లమ్‌ పిల్లలే స్ఫూర్తి

కలల సాకారానికి గోవండీ స్లమ్‌ పిల్లలే స్ఫూర్తి

ముంబై: కలలు, లక్ష్యాలు, ఆశయాలు సాధించాలని కోరుకునే చిన్నారులకు ముంబైలోని ఈస్ట్రన్‌ సబర్బన్‌ ప్రాంత గోవండీ స్లమ్‌ వాసులే స్ఫూర్తి. ఈ మురికివాడకు చెందిన ఆరుగురు విద్యార్థులు ‘నీట్‌-2020’లో అర్హత సాధించారు. త్వరలో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చదువనున్నారు. గోవండీ మురికివాడకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ముంబైలోని క్రిమినల్‌, డ్రగ్‌ కేసులకు పెట్టింది పేరు ఈ స్లమ్‌. 

వీరిలో జైబాఖాన్‌ అనే విద్యార్థి తండ్రి కూడా వైద్యుడే. అయితే, కరోనా మహమ్మారి చికిత్స కోసం తీవ్రమైన వైద్యుల కొరత ఏర్పడటంతో నీట్‌ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్‌ చదువాలని దృఢ నిశ్చయానికి వచ్చినట్లు చెప్పారు. నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌ కోర్సులో చేరడానికి అర్హత సాధించడం అంత తేలిక కాదని, సరైన ప్రణాళికతో చదవడం వల్లే నీట్‌ పరీక్ష రాయగలిగానని జైబాఖాన్‌ చెప్పారు. 

సైఫ్‌ అసిఫ్‌ జొగ్లే అనే మరో విద్యార్థి మాట్లాడుతూ వైద్య విద్యనభ్యసించిన తర్వాత వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న పేదలకు చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. 720 మార్కులకు 591 మార్కులు తెచ్చుకున్న సైఫ్‌ అసిఫ్‌ జోగ్లే తండ్రి కేటరింగ్‌ సర్వీసు ప్రొవైడర్‌ కావడం గమనార్హం. 

గోవండీ స్లమ్‌ వాసుల కోసం స్థానిక వైద్యుల సంఘం స్థాపించిన డాక్టర్‌ జాహిద్‌ఖాన్‌ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వైద్యులు ముందుకు వచ్చేవారు కాదన్నారు. ఇంతకుముందు డ్రగ్స్‌, క్రిమినల్‌ నేరాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందడమే దీనికి కారణం అని చెప్పారు. అందువల్లే తమ పిల్లలను వైద్యవిద్యనభ్యసించాలని చైతన్యపరిచామని జాహిద్ ఖాన్‌ వెల్లడించారు. వైద్యవిద్యతోపాటు ఇంజినీరింగ్‌, న్యాయవాదవిద్యనభ్యసించాలని తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo