శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 14:10:02

మరో 275 చైనా యాప్స్ తొలగించాల్సిందేనా?

మరో 275 చైనా యాప్స్ తొలగించాల్సిందేనా?

బెంగళూరు : గూఢచర్య కార్యక్రమాలకు అవకాశం ఉందని భావిస్తున్న మరో 275 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ పై ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక కన్నేసింది. వాటిలో గేమింగ్ ఆప్ పబ్ జీ, అలీబాబా గ్రూప్ నకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో 59 మొబైల్ యాప్స్ ను నిషేధించిన ట్లుగానే మరికొన్ని యాప్స్ ను తొలగించేందుకు సిద్ధమైంది. తాజాగా మరో 275 మొబైల్ ఆప్స్ పై వేటు పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఐతే వీటన్నిటపై ఒకసారి నిషేధం విధిస్తారా, లేదంటే కొన్నిటిపైనేనా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో పబ్ జీ మొబైల్ యాప్ చైనా లో అత్యంత విలువైన ఇంటర్నెట్ కంపెనీ టెన్సన్ట్ కు చిందినది కావటం విశేషం.

మరో వైపు అలీ ఎక్స్ ప్రెస్ డ్రాగన్ దేశానికి చెందిన అలీ బాబా గ్రూప్ నకు చెందిన విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇండియా లో అనేక స్టార్టప్ కంపెనీల్లో ప్రత్యక్షంగా పెట్టుబడి కూడా పెట్టాయి. దీంతో ఇదొక సున్నితమైన అంశంగా మారిపోయింది. లడఖ్ లో ని గాల్వాన్ లోయలో జరిగిన దుర్ఘట వరకు భారత్.. చైనాతో స్నేహపూర్వకంగా మెలిగింది . పోనీలే పొరుగు దేశం మనకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు అందిస్తూ మన సేవ చేస్తున్నదని అనుకుంది. మరోవైపు మన స్టార్టప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తున్నది కదా అనుకుంది. కానీ దాని వక్ర బుద్ధి ఎంత మాత్రం మారలేదని, హగ్గింగ్ లతో ఒరిగిందేమీ లేదని గుర్తించింది. అందుకే 59 చైనా ఆప్ లపై యుద్ధం ప్రకటించి వాటిని ఇండియా లో పూర్తిగా నిషేధించింది. అందులో కోట్ల కొద్దీ ఇండియన్ల మనసు దోచిన టిక్ టాక్ వంటి మొబైల్ ఆప్స్ కూడా ఉన్నాయి.

ఐనా సరే భారత్ వెనకడుగు వేయలేదు. వాటిపై కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నది. టిక్ టాక్ పై నిషేధం విధించిన తర్వాత చైనా కు చెందిన జిలి, స్నాక్ వీడియో అనే రెండు మొబైల్ ఆప్స్ ప్రత్యామ్నాయంగా నిలిచాయి. అంటే ఒక చైనా ఆప్ కు మరో చైనా ఆప్ ఆల్టర్నేట్ గా ఇప్పటికే అందుబాటులో ఉండటం గమనార్హం. ఇదే అంశం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. అందుకే, అన్ని రకాల చైనా యాప్స్ వాటి డేటా ప్రైవసీ పాలసీ లను నిశితంగా పరిశీలిస్తూ వాటిపై నిరంతర నిఘా పెట్టాలని కేంద్రం భావిస్తున్నది. లేదంటే నిషేధం ఉన్నప్పటికీ మారు పేర్లతో ఇండియా లో చైనా యాప్స్ ఎప్పటికీ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే మన దేశ రహస్య సమాచారాన్ని చైనా చోరీ చేసే ప్రమాదం ఉన్నది.   

  


logo