సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 15:44:55

లాక్‌డౌన్‌ అనంతర పరిష్కార వ్యూహాన్ని రూపొందించాలి : ప్రధాని మోదీ

లాక్‌డౌన్‌ అనంతర పరిష్కార వ్యూహాన్ని రూపొందించాలి : ప్రధాని మోదీ

ఢిల్లీ : లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అదిగమించేందుకు రాష్ర్టాలు, కేంద్రం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు. అన్ని రాష్ర్టాల సీఎంలతో జరిపిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. దేశంలో కోవిడ్‌-19 పరిస్థితిపై ప్రధాని సమావేశంలో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ భేటీలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా రాష్ర్టాల సీఎంలు స్పందిస్తూ... క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారన్నారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు ప్రధానికి తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా తీసుకున్న చర్యలను పీఎంకు వివరించారు. 

అనంతరం ప్రధాని మాట్లాడుతూ... కరోనా కట్టడికి రాష్ర్టాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. కావునా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వ్యూహాలు ఆలోచించుకుని చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడికి స్వచ్చంద, సంక్షేమ సంస్థల, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణకు సహకరిస్తున్న అందరికీ ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. 


logo