శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 01:37:33

కరోనా కోటి కాట్లు

కరోనా కోటి కాట్లు

  • అమెరికా, యూరప్‌ దేశాల్లోనే 75%
  • ఆసియా, మధ్యప్రాచ్యంలో 20శాతం
  • భారత్‌లో ఒక్కరోజే దాదాపు 20వేల కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తున్నది. ఏడు నెలల్లో కోటి మందికి పైగా సోకింది. ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది మరణించారు. భారత్‌లో కరోనా కేసులు 5.28 లక్షలు దాటాయి. మొత్తం కేసుల్లో అమెరికా, యూరప్‌ ఖండాల్లోనే 75% కేసులు రికార్డయ్యాయి. 

లక్షకు 56.. కోటికి 114 రోజులు

చైనాలో కరోనా మొదటి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్ష కేసులకు చేరుకోవటానికి 56 రోజులు పట్టింది. తర్వాత కేవలం 114 రోజుల్లోనే కోటి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. మార్చి 6న లక్ష కేసుల మార్కు చేరుకునే నాటికి ఒకరోజు నమోదయ్యే కొత్త కేసులు 3,874గా ఉంటే 10 లక్షల కొవిడ్‌-19 కేసుల నాటికి 80 వేలు దాటింది. 50 లక్షల నుంచి కోటి మందికి చేరుకునే క్రమంలో ప్రతి రోజూ లక్ష మందికి పైగా కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. భారత్‌లో శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా రికార్డు స్థాయిలో 19,906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,28,859కి చేరుకున్నది.  ఇదే సమయం లో మొత్తం మృతుల సంఖ్య 16,095కు చేరింది. కాగా 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 167 మంది మరణించారు.logo