బుధవారం 20 జనవరి 2021
National - Nov 24, 2020 , 16:51:03

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

చెన్నై : నివర్‌’ తుఫాను దక్షిణ తీరం వైపు కదులుతుండడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 30 బృందాలు రంగంలోకి దిగాయి. బృందాలు తమిళనాడు, పుదుచ్చేరిలో స్థానిక పరిపాలన, ప్రజలను అప్రమత్తం చేస్తాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ సత్య ప్రధాన్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడనం కారణంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి నైరుతి దిశగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కాగా.. వాయువ్య దిశగా కదులుతోంది. తమిళనాడు తీరం వైపు పయనించి పుదుచ్చేరి మీదుగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆర్ కే జెనమణి తెలిపారు.

ఇది మరింత తీవ్రతరం కావచ్చని చెప్పారు. విపత్తు సహాయ సంస్థకు చెందిన 12 బృందాలు మోహరించగా.. 18 బృందాలు ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా మంగళవారం రాత్రి నుంచి పుదుచ్చేరిలో 144 సెక్షన్‌ విధించారు. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని, విద్యుత్‌, నీటి సరఫరా పునరుద్ధరణకు సమన్వయం చేయడంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ఓవర్‌ టైం పని చేస్తున్నామని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే భద్రతా పరికరాలతో 40 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు పాండిచ్చేరికి చేరాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలను మూసివేశారు.


logo