శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 13:10:15

ట్రంప్ ఓట‌మి.. మోదీకి శివ‌సేన చుర‌క‌లు

ట్రంప్ ఓట‌మి.. మోదీకి శివ‌సేన చుర‌క‌లు

ముంబై : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లికన్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ ప్ర‌జ‌లు స‌రైన స‌మాధానం చెప్పార‌ని శివ‌సేన పేర్కొంది. ట్రంప్ ఓట‌మి నుంచి ఎన్డీయే ప్ర‌భుత్వం నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని సామ్నా దిన‌ప‌త్రిక‌లో శివ‌సేన వెల్ల‌డించింది. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ట్రంప్ అర్హుడు కాదు. అత‌ను ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో చేసిన త‌ప్పుల‌ను అమెరికా ప్ర‌జ‌లు గుర్తించి గ‌ద్దె దింపారు. ట్రంప్ ఒక్క వాగ్దానం కూడా నెర‌వేర్చ‌లేక‌పోయార‌ని తెలిపింది.  

అమెరికాలో నిరుద్యోగ స‌మ‌స్య కొవిడ్ మ‌హ‌మ్మారి కంటే ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ నిరుద్యోగ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొన‌లేదు. ప‌రిష్కారానికి బ‌దులుగా అసంబ‌ద్ద వాద‌న‌లు, రాజ‌కీయ జ‌పాలు చేస్తూ ట్రంప్ నిరుద్యోగుల‌ను విస్మ‌రించార‌ని శివ‌సేన పేర్కొంది.  

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా అమెరికా ఫ‌లిత‌మే పున‌రావృతం అవుతుంద‌ని తెలిపింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి స్ప‌ష్టంగా ఓటమి పాల‌వుతుంద‌ని చెప్పింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ముందు ప్ర‌ధాని మోదీ, నితీష్ కుమార్ నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని పేర్కొంది. అన్ని స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసిన నితీష్ కుమార్ ప్ర‌భుత్వం గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పింది. 

ట్రంప్ ఓట‌మిని అంగీక‌రించ‌కుండా, ఓటింగ్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్య‌స్పాదంగా ఉంద‌ని శివ‌సేన తెలిపింది. ఇక భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హ్యారిస్ అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌వ‌డాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆమె విజ‌యాన్ని ట్రంప్ ఖండించారు. ఒక మ‌హిళ‌కు గౌర‌వం ఇవ్వ‌ని ట్రంప్‌కు ప్ర‌ధాని మోదీ, బీజేపీ నాయ‌కులు మ‌ద్ద‌తు తెల‌ప‌డం స‌రికాద‌ని శివ‌సేన అభిప్రాయ‌ప‌డింది. భార‌త్ న‌మ‌స్తే ట్రంప్ నిర్వ‌హించినా.. అమెరికా ప్ర‌జ‌లు మాత్రం తెలివిగా ట్రంప్‌కు బై బై చెప్పి త‌మ త‌ప్పును స‌రిద్దిదుకున్నార‌ని శివ‌సేన పేర్కొంది.