శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 19:46:32

బిహార్‌లో ముందంజలో ఎన్డీఏ

బిహార్‌లో ముందంజలో ఎన్డీఏ

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ముందంజలో ఉంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌పై మెజారిటీ సాధించేలా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎన్‌డీఏ అభ్యర్థులు 107 స్థానాల్లో విజయం సాధించారు. మూడు దశల్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  4.16 కోట్లు పోలు కాగా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలు పాటించేందుకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఈ సారి పెద్ద ఎత్తున ఈసీ పెంచింది. దీంతో ఫలితాలు ఆలస్యమవుతాయని, రాత్రి వరకైనా ఫలితాలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

243 మంది సభ్యులున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 125 సీట్లు అవసరం కాగా.. సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీఎ కూటమి ఇప్పటి వరకు 107 స్థానాల్లో విజయం సాధించగా.. 15 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థులు 98 మంది విజయం సాధించగా.. 16 చోట్ల లీడ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మూడింట రెండొంతుల ఓట్లను లెక్కించాల్సి ఉండగా.. పలు చోట్ల రెండు కూటమిల మధ్య ఆధికత్యం వెయ్యి ఓట్లతో విజయం దోబుచులాడుతోంది. ఇదిలా ఉండగా మహాఘట్‌బంధన్‌ కూటమి సీఎం అభ్యర్థి రాఘోపూర్‌ నుంచి పోటీ చేయగా.. ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ హసన్‌పూర్‌ నుంచి బరిలోకి దిగారు.

ఎన్డీఏ మిత్రపక్షం హెచ్‌ఎంఎం నేత జీతన్‌ రామ్‌ మాంఝీ ఇమామ్‌గంజ్‌లో బరిలోకి దిగగా.. ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు. వికాషీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)కి చెందిన ముఖేశ్‌ సాహ్నీ సిమ్రీబక్తియార్‌పూర్‌లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. నందకిశోర్‌ యాదవ్‌, బిజేంద్ర ప్రసాద్‌యాదవ్‌, బినోద్‌ నారాయణ్‌తో సహా పలువురు మంత్రులు గెలుపు దిశగా పయనిస్తుండగా.. శైలేశ్‌కుమార్‌ వెనుకబడ్డారు. లోక్‌సభ సభ్యుడైన జన్‌ అధికార్‌ పార్టీకి చెందిన రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పుయాదవ్‌ బరోమాధేపురాలో వెనుకబడిపోయారు. పాట్నాలో బంకీపూర్‌ స్థానంలో కాంగ్రెస్‌ నేత శత్రుజ్ఞసిన్హా కుమారుడు లూవ్‌ సిన్హా ఫలితాల్లో వెనుకబడ్డారు.

పోల్‌ ట్రండ్‌ చూస్తే బీజేపీ మరో బీజేపీ 74 స్థానాల్లో ఆధిక్యంతో అతిపెద్ద ఏకైక పార్టీగా నిలిచే అవకాశం ఉంది. నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం 39 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షాలు పలు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ 68 స్థానాల్లో విజయం సాధించి బీజేపీకి పోటీగా నిలుస్తోంది. కాంగ్రెస్‌ 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అలాగే సీపీఐ ఎంఎల్‌ 13, సీపీఐ (ఎం) అభ్యర్థులు మూడు చోట్ల ముందంజలో ఉన్నారు.  ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ ఒక స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.