బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 02:05:25

వలపు వల వేసే గూఢచారి చిక్కాడు

వలపు వల వేసే గూఢచారి చిక్కాడు

  • నేవీ హనీట్రాప్‌ నిందితుడు మొహమ్మద్‌ హరూన్‌ అరెస్టు
  • వ్యాపారం ముసుగులో గూఢచర్యం
  • నేవీ అధికార్లకు డబ్బులిచ్చింది ఇతడే

పాక్‌ గూఢచారుల పరిధిలో పనిచేసే కొందరు అమ్మాయిలు సోషల్‌మీడియా ద్వారా ముందుగా భాతర నేవీ అధికారులు, ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొనేవారు. ఆ తర్వాత భారత్‌లోని పాక్‌ ఏజెంట్లు హనీట్రాప్‌ వివరాలు బయటపెడుతామని బెదిరించి నేవీ అధికారుల నుంచి భారత యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు, వాటి సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్లు సహా అత్యంత సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారులకు చేరవేసేవారు. ఈ సమాచారం ఇచ్చినందుకు కొంత డబ్బుకూడా రహస్యంగా వారి ఖాతాల్లో జమచేసేవారు. 

న్యూఢిల్లీ, మే 15: భారత నౌకాదళంలో కలకలం సృష్టించిన హనీట్రాప్‌ కుట్రకేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్టు చేసింది. ముంబైకి కిందిన మొహమ్మద్‌ హరూన్‌ హాజీ అబ్దుల్‌ రహమాన్‌ లక్డావాలాను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు, అతని ఇంటినుంచి గూఢచర్యంకోసం వాడే పలు సాంకేతిక పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నౌకాదళం అధికారులకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అమ్మాయిలను ఎరవేసి నేవీకి చెందిన కీలక సమాచారం రాబట్టి పాకిస్థాన్‌కు చేరవేయటంలో ఇతడు కీలకంగావ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు. విశాఖపట్టణం నౌకాదళ కేంద్రంగా జరిగిన ఈ గూఢచర్యం 2019 డిసెంబర్‌ 20న బయటపడింది. దీంతో ఈ కుట్ర లోతులను తవ్వితీసేందుకు ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌' పేరుతో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. గతేడాది డిసెంబర్‌ 29న విజయవాడ పోలీస్‌స్టేషన్లో ఐపీసీ సెక్షన్‌ 120బీ, 121ఏ, యూఏ(పీ) చట్టం సెక్షన్‌ 17,18 అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్‌ 3 కింద విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి 11 మంది నేవీ అధికారులుసహా 14 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వారిలో పాకిస్థాన్‌లో జన్మించిన భారత జాతీయుడు షియాస్తా కైసర్‌ కూడా ఉన్నాడు. 

అంతర్జాతీయ వ్యాపారం ముసుగులో..

ఎన్‌ఐఏ శుక్రవారం అరెస్టు చేసిన మొహమ్మద్‌ హరూన్‌ అంతర్జాతీయ వ్యాపారం ముసుగలో భారత నేవీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసేవాడు. గతంలో అతడు చాలాసార్లు పాకిస్థాన్‌లోకి కరాచీ వెళ్లి పాక్‌ గూఢచారులు అక్బర్‌ అలియాస్‌ అలీ, రిజ్వాన్‌ను కలిశాడు. వారి ఆదేశాలమేరకు ఈ కుట్రలో భాగస్వాములైన నేవీ అధికారుల బ్యాంకు ఖాతాల్లో తరచూ డబ్బు జమచేస్తుండేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాక్‌ గూఢచారులు భారత నేవీ రహస్యాలు తెలుసుకొనేందుకు అత్యంత కట్టుదిట్టంగా ప్రణాళిక రూపొందించారని విచారణలో బయటపడింది. భారత్‌లో అనేకచోట్ల ఏజెంట్లను ఏర్పాటుచేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరితో గూఢచర్యం నిర్వహించారు. పాక్‌ గూఢచారుల పరిధిలో పనిచేసే కొందరు అమ్మాయిలు సోషల్‌మీడియా ద్వారా ముందుగా భాతర నేవీ అధికారులు, ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకొనేవారు. ఆ తర్వాత భారత్‌లోని పాక్‌ ఏజెంట్లు హనీట్రాప్‌ వివరాలు బయటపెడుతామని బెదిరించి నేవీ అధికారుల నుంచి భారత యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలు, వాటి సాంకేతిక పరిజ్ఞానం, ఆపరేషన్లు సహా అత్యంత సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారులకు చేరవేసేవారు. ఈ సమాచారం ఇచ్చినందుకు కొంత డబ్బుకూడా రహస్యంగా వారి ఖాతాల్లో జమచేసేవారు.


logo