శనివారం 28 మార్చి 2020
National - Feb 21, 2020 , 02:40:22

మాంసాహారంపై ఎగ్జిబిషన్‌లో వివాదం

మాంసాహారంపై ఎగ్జిబిషన్‌లో వివాదం
  • మెనూ నుంచి తొలిగించిన జాతీయ మ్యూజియం
  • సందర్శకుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయమని వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత పాకశాస్త్ర చరిత్రపై నేషనల్‌ మ్యూజియం ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శన కార్యక్రమంలో సందర్శకులకు మాంసా హారాన్ని  అందుబాటులో ఉంచడం వివాదంగా మారింది. దీంతో కేవలం శాఖాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో సందర్శకులకు మాంసాహారం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తొలుత మ్యూజియానికి చెందిన వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మెనూ (ఆహార పదార్థాల జాబితా) నుంచి మాంసాహారాన్ని తొలిగించారు. మ్యూజియం అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్రతానాథ్‌ మాట్లాడుతూ ‘ప్రాచీన భారతదేశపు ఆహార అలవాట్ల గురించి వివరించడానికి ఈ కార్యక్రమాన్ని (ఫుడ్‌ ఈవెంట్‌ను) చేపట్టాం. జాతీయ మ్యూజియం, సాంస్కృతిక శాఖ, వన్‌ స్టేషన్‌ మిలియన్‌ స్టోర్స్‌ (ఎస్‌ఎంఎస్‌) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే మాంసాహారాన్ని కూడా సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఓఎస్‌ఎంఎస్‌ మాతో చెప్పలేదు. వెబ్‌సైట్‌ లో పొందుపర్చిన ఆహార వివరాల్లో మాంసాహారం కూడా ఉండటంతో పలు విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే మెనూ నుంచి మాంసాహారాన్ని తొలిగించాం’ అని పేర్కొన్నారు. ‘మ్యూజియంలో దేవుళ్ల ప్రతిమలు ఉంటాయి. కాబట్టి మ్యూజియాన్ని సందర్శించే వారి మనోభావాలను గౌరవిస్తాం. అందుకే మాంసాహారాన్ని అనుమతించం. కేవలం సందర్శకులను దృష్టిలో ఉంచుకొని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సుబ్రతానాథ్‌ తెలిపారు.


logo