శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:53:01

రేడియో ప్రసారాలు మొదలైంది ఈరోజే!

రేడియో ప్రసారాలు మొదలైంది ఈరోజే!

దేశంలో తొలిసారి రేడియో ద్వారా ప్రసారాలను ప్రారంభించిన రోజును పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా జాతీయ ప్రసార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1927 లో ఇదే రోజున మన దేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారాలు బొంబాయి నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రతిచోటా వార్తలతోపాటు వినోదానికి సులభమైన మాధ్యమంగా మారిన ఏకైక పరికరం రేడియో మాత్రమే అని ట్వీట్‌లో జవదేకర్ పేర్కొన్నారు.

గత 93 ఏండ్లలో దేశంలో రేడియో ప్రసారం అనేక మైలురాళ్లను సాధించింది. 1927 నుంచి భారతదేశంలో ప్రజల జీవితంలో రేడియో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. 1936 జూన్ 8 న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కాస్తా ఆలిండియా రేడియోగా మారింది. ఇది ప్రపంచంలోని ప్రధాన ప్రసార సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని న్యూస్ సర్వీసెస్ విభాగం భారతదేశంతోపాటు విదేశాలలోని శ్రోతలకు వార్తలు, వ్యాఖ్యలను అందిస్తున్నది. ఆలిండియా రేడియో ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు సమాచారం తెలియజేయడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని అందించడానికి.. ఇలా బహుముఖ సేవలను అందిస్తూ వస్తున్నది. ఆలిండియా రేడియో 23 భాషల్లో 414 స్టేషన్లు ఉన్నాయి. 179 మాండలికాలలో ప్రసారాలు జరుగుతున్నాయి. 

ఒక స్టేషన్‌ను నాలుగు కొత్త స్టేషన్ల ద్వారా మార్చడమే కాకుండా.. కొత్త టెక్నాలజీ ద్వారా ఆలిండియా రేడియో సేవలు మీడియం వేవ్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ద్వారా ఎక్కువ మందికి చేరుతుందని జవదేకర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆలిండియా రేడియో శ్రోతలకు ప్రసార భారతి చైర్మన్ ఏ సూర్య ప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు.

'బహుజన్ హితాయ.. బహుజన్ సుఖాయ' అనే నినాదానికి అనుగుణంగా రేడియో జీవిస్తున్నదని చెప్పవచ్చు. 


logo