శనివారం 11 జూలై 2020
National - May 25, 2020 , 18:06:51

వరదల ధాటికి జాతీయ రహదారే కొట్టుకుపోయింది

వరదల ధాటికి జాతీయ రహదారే కొట్టుకుపోయింది

గువాహటి: అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి సోమవారం గోల్పారా జిల్లాలోని అగియా-లఖీంపూర్‌ జాతీయ రహదారి తెగిపోయింది. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. దాదాపు వంద మీటర్ల మేర 12వ నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకు పోవడంతో ఆ దారిలో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఎడతెరపి లేని వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. నదీ పరివాహక ప్రాంతంలోని పంటలు, ఆవాసాలు మొత్తం నీట మునిగాయి. దీంతో వందల మంది జనం నిరాశ్రయులయ్యారు. వరదలవల్ల అసోం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిన్నచిన్న రహదారులు కూడా తెగిపోయాయి. చెరువులు, కుంటల కట్టలు తెగిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 


logo