బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 02:38:07

కరోనాకు ముక్కు టీకా

కరోనాకు ముక్కు టీకా

  • భారత్‌ బయోటెక్‌లో తయారీ
  • వాషింగ్టన్‌ యూనివర్సిటీతో ఒప్పందం
  • బిలియన్‌ డోసుల ఉత్పత్తి లక్ష్యం
  • జినోమ్‌ వ్యాలీలో టీకాల ఉత్పత్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారికి ముకుతాడు వేసే ముక్కు టీకా తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ ఓ కీలక ఒప్పందం కుదర్చుకొన్నది. కొవిడ్‌-19 నివారణకు అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అభివృద్ధిచేస్తున్న ‘నాసల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ (ముక్కు ద్వారా ఇచ్చే టీకా)’ను భారత్‌లో తయారుచేసేందుకు భారత్‌ బయోటెక్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు డబ్ల్యూయూతో బుధవారం ఒప్పందం చేసుకొని,   ముక్కుద్వారా వేసే టీకా ఉత్పత్తి, పంపిణీ హక్కులు పొందింది.  ఈ వాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి 100 కోట్ల డోసులను చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ్ణ ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఈ ముక్కు టీకాను భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్టు సమాచారం. 

కొవ్యాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవ్యాగ్జిన్‌' మూడోదశ ట్రయల్స్‌ అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నది. కొవ్యాగ్జిన్‌ ప్రయోగాలు ఇప్పటికే మొదటిదశ పూర్తయ్యాయి. ఆ సమాచారాన్ని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) పంపించారు. ప్రస్తుతం రెండోదశ తుదిదశలో ఉన్నది. వచ్చే నెలలో 25 వేలనుంచి 30 వేల మందిపై మూడోదశ ప్రయోగాలు ప్రారంభించాలని సంస్థ యోచిస్తున్నది. 


logo