శనివారం 11 జూలై 2020
National - May 28, 2020 , 17:18:34

పుస్తక రూపంలోకి జగజ్జననికి మోదీ రాసిన లేఖలు

పుస్తక రూపంలోకి జగజ్జననికి మోదీ రాసిన లేఖలు

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను దేవుళ్లకు విన్నవిస్తూ నిత్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన లేఖలు త్వరలో పుస్తక రూపంలోకి రానున్నాయి. నిరుద్యోగం, అక్షరాస్యత, పేదరికం, భిక్షాటన.. ఇలా ఎన్నో సమస్యలు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, వీటిని పరిష్కరించే మార్గాలు చూపాలంటూ ప్రతిరోజు రాత్రి దేవుళ్లకు మోదీ లేఖలు రాసేవారు. 1986 నుంచి ఆయన అలా లేఖలు రాయడం అలవాటుగా చేసుకొన్నారు. జగజ్జననికి రాసిన ఎన్నో లేఖలు గుజరాతీ భాషలో ఉన్నాయి. వీటిని హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోకి ప్రముఖ రచయిత్రి, పద్మశ్రీ భావనా సోమాయ అనువదించారు. ఈ పుస్తకాన్ని హార్పర్‌ కొలిన్స్‌ ప్రచురిస్తున్నారు.

'ఈ లేఖల్లో ఉన్న సమాచారం నాలోని భావాలు, పరిశీలనలు, కొన్నిసార్లు ప్రాసెస్‌ చేయని ఆలోచనలు, వడపోతలేకుండా చేసిన వ్యక్తీకరణలను వివరిస్తాయి. నేను రచయితను కాదు. మనలో చాలా మంది కారు. కానీ ప్రతి ఒక్కరూ వ్యక్తీకరణ చేయాలని కోరుకొంటారు. మనుసులోని కోరికలను బయటపెట్టాలంటే పెన్ను, కాగితం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. గుండెలో మనుసులో ఏం జరుగుతుందో ఆత్మపరిశీలన చేసుకొని అక్షరబద్ధం చేసినప్పుడే దానికి విలువుంటుంది' అని పుస్తకం గురించి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

యువకుడిగా ఉన్నప్పటి నుంచి నరేంద్రమోదీకి లేఖలు రాయడం అలవాటుగా ఉండేది. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు జగత్‌ జననిని గుర్తుచేసుకొంటూ.. దుఃఖం, నశ్వరమైన ఆనందం, జ్ఞాపకాలను ఈ లేఖల్లో పొందుపరిచేవారు. రచనలు చేయడం మోదీ బలం కాగా, ఆయన భావోద్వేగాలు అనంతం అని రచయిత్రి భావనా సోమాయ అన్నారు. వచ్చే నెలలో ఈ పుస్తకాన్నిఆవిష్కరించేందుకు హార్పర్‌ కొలిన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


logo