మంగళవారం 31 మార్చి 2020
National - Feb 26, 2020 , 02:58:12

శతాబ్దపు మైత్రి

శతాబ్దపు మైత్రి
  • ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలే మన ప్రాతిపదిక
  • ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా అడుగులేద్దాం
  • భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభం
  • సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత్‌, అమెరికా మైత్రి 21వ శతాబ్దంలో ‘అతి ముఖ్యమైన భాగస్వామ్యాలలో ఒకటని’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ద్వైపాక్షిక, రక్షణ, భద్రత సహకారం ఈ వ్యూహాత్మక బంధంలో కీలకమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో విస్తృత స్థాయి చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల వాణిజ్య మంత్రుల మధ్య సానుకూల చర్చలు జరిగాయని మోదీ తెలిపారు. ‘మంత్రులు అంగీకారానికి వచ్చిన అవగాహన ఒప్పందానికి చట్టరూపు ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్‌, నేను నిర్ణయించాం. భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. 


రెండు దేశాలకు ఇది మంచి ఫలితాలు అందిస్తుందని మేం భావిస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాలను విస్తృత ప్రపంచ భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచంలో కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో సుస్థిర, పారదర్శక నిధుల వినియోగం ఉండాలని అంగీకారానికి వచ్చామని, ప్రపంచ ప్రయోజనాల దృష్టానే ఈ పరస్పర అవగాహన అని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత్‌లో లభించిన అపూర్వ స్వాగతం ఎన్నటికీ గుర్తుండి పోతుందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రభుత్వాల వరకే పరిమితం కాదని, ప్రజలు కేంద్రంగానే  బంధం బలోపేతమైందన్నారు.  గత ఎనిమిది నెలల్లో ట్రంప్‌ను ఐదుసార్లు కలిసిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు.   


డ్రగ్స్‌, నార్కో టెర్రరిజం కట్టడికి నూతన యంత్రాంగం

రక్షణ, భద్రత, ఇంధన, సాంకేతికత, గ్లోబల్‌ కనెక్టివిటీ, వాణిజ్యం తదితర అంశాల్లో అధ్యక్షుడు ట్రంప్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా, నార్కో టెర్రరిజం తదితర వ్యవస్థీకృత నేరాల కట్టడికి నూతన యంత్రాంగం ఏర్పాటుచేసేందుకు రెండు దేశాలు నిర్ణయించాయని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పారదర్శకతకు భారత్‌, అమెరికా కట్టుబడి ఉన్నాయని, గత మూడేండ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెండంకెల వృద్ధిని సాధించిందని వివరించారు. సమావేశానికిముందు ప్రధాని మాట్లాడుతూ.. ట్రంప్‌కు మరోసారి స్వాగతమని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు ట్రంప్‌ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. 


మూడు ఎంవోయూలు 

మోదీ-ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌-అమెరికా మధ్య ఆరోగ్యం, ఇంధన రంగాలకు సంబంధించి మూడు ఎంవోయూలు కుదిరాయి. మానసిక ఆరోగ్యంపై రెండు దేశాల ఆరోగ్యశాఖల మధ్య, సురక్షిత ఔషధాల ఉత్పత్తికి భారత్‌కు చెందిన సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మధ్య, ఇంధన రంగంలో సహకారానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), ఎక్సాన్‌ మొబిల్‌ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌, చార్ట్‌ ఇండస్ట్రీస్‌ మధ్య ఎంవోయూలు కుదిరాయి. వీటిపై ఆయా విభాగాలు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.


logo
>>>>>>