మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 05, 2020 , 15:39:13

నేపాల్‌కు వైద్య సామాగ్రి అందజేసిన నరవణే

నేపాల్‌కు వైద్య సామాగ్రి అందజేసిన నరవణే

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం నేపాల్‌ వెళ్లిన భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వ‌ణే ఆ దేశ ఆర్మీకి వైద్య సామగ్రిని అందజేశారు. ఎక్స్-రే యంత్రాలు, కంప్యూటెడ్ రేడియోగ్రఫీ వ్యవస్థలు, ఐసీయు వెంటిలేటర్లు, వీడియో ఎండోస్కోపీ యూనిట్లు, అనస్థీషియా యంత్రాలు, ప్రయోగశాల పరికరాలు, సైనిక అంబులెన్సులను నేపాల్‌కు చెందిన రెండు ఆర్మీ దవాఖానలకు భారత్‌ తరుఫున నరవణే అందజేశారు. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం గురువారం ఈ విషయాన్ని తెలిపింది. కరోనా పోరాట సహాయంలో భాగంగా నేపాల్‌ ఆర్మీకి అదనపు వెంటిలేటర్లను కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొంది. 

మరోవైపు ఖాట్మండు తుండిఖేల్‌లోని ఆర్మీ పెవిలియన్ బిర్ స్మారక్ (అమరవీరుల స్మారక చిహ్నం) వద్ద నరవణే గురువారం నివాళులర్పించారు. నేపాలీ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పూర్ణ చంద్ర థాపాతో నరవణే సమావేశమయ్యారు. భారత్‌, నేపాల్‌ మధ్య సైనిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరు చర్చలు జరిపారు.

ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌ర‌వ‌ణేకు ఆ దేశాధ్య‌క్షురాలు బింద్యాదేవీ భండారి నేపాలీ ఆర్మీ జనరల్ హోదాను ప్రదానం చేయ‌నున్నారు. సరిహద్దు వివాదాల నేప‌థ్యంలో ఇండో-నేపాల్ సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో న‌ర‌వ‌ణే పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.