ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 18:09:46

యుద్ధ స్మారక చిహ్నంలోకి గల్వాన్ అమరులు

యుద్ధ స్మారక చిహ్నంలోకి గల్వాన్ అమరులు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో అమరులైన జవాన్లను జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ఎక్కించనున్నారు. ఈ స్మారక చిహ్నంపై అమరవీరుల పేర్లను చెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు. జూన్ 15 న చైనా దళాలతో ధైర్యంగా పోరాడి 20 మంది భారత ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

స్మారక చిహ్నంలో గల్వాన్ అమరవీరుల పేర్లను చెక్కే ప్రక్రియకు కొన్ని నెలల సమయం పట్టవచ్చని ఆర్మీ అధికారులు తెలిపారు. గత ఐదు దశాబ్దాలలో తొలిసారిగా చైనా-భారత దళాలు జూన్ 15 రాత్రి చాలా సమయం పాటు తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో మరణించిన భారత ఆర్మీ సిబ్బందిలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి కల్నల్ బి సంతోష్ బాబు ఉన్నారు. ఈ సంఘటన తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతను గణనీయంగా పెంచింది. దీనిని "చైనా ముందుగా నిర్ణయించిన, ప్రణాళికాబద్ధమైన చర్య" అని భారత్ పేర్కొన్నది.

గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా నిఘా పోస్టును నిర్మించడాన్ని తప్పుపట్టిన భారత సైనికులతో చైనా సైనికులు ఘర్షణకు దిగి దారుణంగా రాళ్ళు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో తన వైపు ఎంత ప్రాణనష్టం జరిగిందే చైనా వెల్లడించలేదు. అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. చైనా వైపు మరణించిన వారి సంఖ్య 35కు పైనే ఉంటుంది. 

గల్వాన్ లోయ ఘర్షణలో మరణించిన భారత సైనికులు సరిహద్దును పరిరక్షించడంలో ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని చూపించడమే కాకుండా 130 కోట్ల మంది భారతీయులను కూడా రక్షించారని సైనికులను ఉద్దేశించి జూలై 17న చేసిన ప్రసంగంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.


logo