శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 14:29:35

ఈయనే కాబోయే రిచ్చెస్ట్‌ ఎమ్మెల్సీ

ఈయనే కాబోయే రిచ్చెస్ట్‌ ఎమ్మెల్సీ

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఎం నాగరాజు కాబోయే రిచ్చెస్ట్‌ ఎమ్మెల్సీగా రికార్డులకెక్కనున్నారు. ఈయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఇటీవలనే ప్రకటించగా.. తనకు 155 బ్యాంకుల్లో రూ.144.41 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని నామినేషన్ల అఫిడవిట్‌లో వెల్లడించారు. హోస్కోట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎం నాగరాజు.. బీజేపీ రెబల్‌ అభ్యర్థి శరత్‌ బచ్చే గౌడ చేతిలో పరాజయం పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాన అనుచరుడైన ఎం నాగరాజు.. గత ఏడాది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 

త్వరలో జరుగనున్న కౌన్సిల్‌ ఎన్నికల్లో ఎం నాగరాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన నామినేషన్‌ పత్రాలతోపాటు జతపరిచిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులను వెల్లడించారు. తన భార్య పేరిట 42 బ్యాంకుల్లో రూ.34.08 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, తనకు చెందిన 14 సేవింగ్స్ అకౌంట్లలో రూ.20.26 కోట్లు, తన భార్యకున్న నాలుగు సేవింగ్స్‌ అకౌంట్లలో రూ. 11.21 కోట్లు ఉన్నాయని తెలిపారు. తన చేతిలో నగదు రూ. 30.5లక్షలు ఉండగా.. తన భార్య వద్ద రూ.45.6 లక్షల నగదు ఉన్నదని, ఎంటీబీ ఎస్టేట్స్ అండ్‌ ప్రాపర్టీస్‌లో తన పేరిట రూ. 9.15కోట్లు, శబరి ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.2.81 కోట్ల పెట్టుబడులు, అలాగే ఎంటీబీలో తన భార్య రూ. 65.7కోట్లు, శబరిలో రూ.4.49 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు.

తన పేరు మీద రూ.10 లక్షల ఎల్‌ఐసీ పాలసీలు ఉండగా, తన భార్య పేరిట రూ.54.76 లక్షల పాలసీలు ఉన్నాయని, తన వద్ద రూ.2.48 కోట్ల విలువైన ఐదు కార్లు ఉండగా.. తన భార్య పేరిట రూ.1.72 కోట్ల విలువ చేసే కారున్నదని తెలిపారు. ఇక బంగారునగలు తన వద్ద రూ.2.23 కోట్ల విలువైనవి ఉండగా.. తన సతీమణి వద్ద రూ.1.48 కోట్ల విలువైనవి ఉన్నాయంట.

అదేవిధంగా, రూ.29.86 కోట్ల విలువైన 53 ఎకరాల ఫార్మ్‌ భూమి, రూ.308.52 కోట్ల విలువచేసే వ్యవసాయేతర భూములు ఉండగా... ఈయనగారి భార్య పేరిట రూ.26.4 కోట్ల ఖరీదు చేసే నాలుగు ఎకరాల భూమి కలిగివున్నదంట. వీటితోపాటు రూ.73 కోట్ల విలువ చేసే భవనాలు, ఇండ్లు కూడా ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్‌లో నాగరాజు వెల్లడించారు. ప్రస్తుత కౌన్సిల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈయనే రిచ్చెస్ట్‌ ఎమ్మెల్సీగా రికార్డులకెక్కనున్నారు.


logo