బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 20:21:48

బాబ్రీ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామన్న ముస్లిం లా బోర్డు

బాబ్రీ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామన్న ముస్లిం లా బోర్డు

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, జోషి, ఉమా భారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ముస్లిం సంస్థలతో కలిసి దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీనియర్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి చెప్పారు. మరోవైపు దీనిపై కచ్చితంగా హైకోర్టుకు వెళ్తామని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్‌యాబ్ జిలానీ తెలిపారు. ఈ కేసులో వందలాది మంది సాక్ష్యులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఎంతో కీలకమని ఆయన అన్నారు. నిందితులు స్టేజీపై కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఐపీఎస్ అధికారులు, జర్నలిస్టులు సాక్ష్యం ఇచ్చారని, సీబీఐ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర కాదని, ఆ పరిస్థితుల్లో కొందరు సంఘ విద్రోహ శక్తులు బాబ్రీ కూల్చివేతకు పాల్పడ్డారని సీబీఐ కోర్టు తన తీర్పులో పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని అన్నారు.



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo