గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 10:35:27

ఆ భూమిపూజకు ముస్లిం యువకుడు 800 కి.మీ. కాలినడక

ఆ భూమిపూజకు ముస్లిం యువకుడు 800 కి.మీ. కాలినడక

భోపాల్‌ : అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన భూమిపూజ చేయనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. అయితే ఓ ముస్లిం యువకుడు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలినడకన బయల్దేరాడు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అయోధ్యకు 800 కిలోమీటర్ల మేర అతను నడక సాగించనున్నారు. మధ్యప్రదేశ్‌ చేరుకున్న అతన్ని మీడియా పలుకరించింది.

ఈ సందర్భంగా ముస్లిం యువకుడు మహ్మద్‌ ఫైజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తాను ముస్లిం కుటుంబం నుంచి వచ్చానని తెలిపాడు. కానీ తాను రామ భక్తుడిని అని స్పష్టం చేశాడు. తమ పూర్వీకులే హిందువులేనని, వారి పేర్లు రామ్‌లాల్‌ లేదా శ్యామ్‌ లాల్‌ అయి ఉండొచ్చన్నారు. తమ ప్రధాన పూర్వీకుడు రాముడే అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ జాతీయ కవి అల్లామా ఇక్బార్‌ కూడా రాముడిని భారత ప్రభువుగా పరిగణిస్తాడు. ఈ భక్తితోనే తాను రాముని తల్లి కౌశల్య జన్మస్థలం చంద్‌ఖురి(ఛత్తీస్‌గఢ్‌) ప్రాంతం నుంచి ఇసుకను అయోధ్యకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. రామమందరం భూమిపూజలో ఈ ఇసుకను సమర్పిస్తానని తెలిపాడు. 

దేవాలయాలకు కాలినడకన వెళ్లడం తనకు ఇదేమీ కొత్త కాదన్నారు ఫైజ్‌ ఖాన్‌. వివిధ ఆలయాలకు, మఠాలకు 1500 కి.మీ. మేర నడిచాను అని పేర్కొన్నాడు. తనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేదని చెప్పాడు. రామాలయం నిర్మాణం సందర్భంగా భారతదేశంలో ఉద్రిక్తతలను సృష్టించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని మహ్మద్‌ అన్నాడు.


logo