శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:28:18

ఈ డాక్టర్.. ప్రాణదాత.. అన్నదాత

ఈ డాక్టర్.. ప్రాణదాత.. అన్నదాత

ముంబై : రోగికి చికిత్స చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతారు వైద్యులు. కానీ, ముంబైకి చెందిన ఈ వైద్యుడు ప్రాణాలు కాపాడటమే కాదు.. ఆకలితో అలమటిస్తున్న వారి కడుపునింపుతున్నాడు. ముంబైలోని భయాందర్‌లో నివసిస్తున్న డాక్టర్ ఉదయ్ మోడీ.. ఆయుర్వేదంలో ఎండీ చదివారు. రోగులకు చికిత్స అందించడమే కాకుండా.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నవారికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నాడు. ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదని, ఈ కారణంగా అనారోగ్యానికి గురికావద్దనేది ఈయన ప్రధాన ఉద్దేశం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ మోడీ సేవలు మరింత పెరిగాయి. నిత్యం 300 మందికి పైగా వృద్ధులకు ఆహారం అందించడానికి కృషి చేస్తున్నారు.

51 ఏండ్ల డాక్టర్ ఉదయ్ మోడీ గత 13 ఏండ్లుగా చికిత్స చేయడంతో పాటు ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పాలు మినహా అన్ని వస్తువుల సరఫరాను భయాందర్ ప్రాంతంలో నిషేధించారు. అటువంటి పరిస్థితుల్లోనూ తనకు ఇబ్బందులు ఎదురైనా  నిత్యసేవలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూశారు.

2007లో చికిత్స కోసం తన వద్దకు వచ్చిన ఒక వృద్ధుడు.. ముగ్గురు కుమారులు ఉన్నా తనను, పక్షావాతానికి గురైన తన భార్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఏడుస్తూ తన దీనగాథ వెల్లబోసుకున్నాడు. వృద్ధుడి కథ విన్న డాక్టర్ మోడీ.. ఆ క్షణంలోనే 'శ్రావన్ టిఫిన్ సేవా' ప్రారంభిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొదట్లో వారు తమ ఇంటి పరిసరాల్లో ఉండే వృద్ధ దంపతులకు మాత్రమే భోజనం అందించేవారు. ప్రస్తుతం 300 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.

ఆహారం, మందులు, ఇతర ఏర్పాట్లు కూడా..

తన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న కారణంగా డాక్టర్ మోడీ ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పెద్ద వంటగదిని కూడా నిర్మించారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది వంట బాధ్యత తీసుకుంటారు. డాక్టర్ మోడీ ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అవసరమైన వృద్ధులకు టిఫిన్ అందజేస్తారు. ఇది కాకుండా వృద్ధుల ఇంటికి వెళ్లి వారి అరోగ్యం గురించి కనుక్కొని అవసరమైన ఔషధాలు, ఇతర వస్తువులను అందజేస్తుంటారు.  ఇందుకోసం 11 మంది సిబ్బందిని నియమించుకుని ప్రతి నెలా దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. 

సేవా కార్యక్రమాలకు సరిపడా సంపాదన లేకపోవడంతో నిధుల సేకరణ కోసం టీవీ సీరియళ్లలో పనిచేయడం ప్రారంభించారు. క్రైమ్ పెట్రోల్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా, సీఐడీతో పాటు 72 సీరియల్స్, 9 గుజరాతీ చిత్రాలలో కూడా నటించారు.


logo