బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 20:02:06

ఆన్‌లైన్ ఫాలోవర్స్ కావాలా.. లక్షల్లో సిద్ధం

ఆన్‌లైన్ ఫాలోవర్స్ కావాలా.. లక్షల్లో సిద్ధం

ముంబై: ఆన్‌లైన్ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ఉండటం ప్రస్తుతం స్టాటస్ సింబల్ గా మారింది. ఈ నేపథ్యంలో వీరి అవసరాన్ని ఆసరగా చేసుకొని నకిలీ ఆన్‌లైన్ ఫాలోవర్స్ ను సిద్ధం చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒకేసారి వేలు, లక్షల్లో నకిలీ ఫాలోవర్స్ ను ఇస్తూ ఈ సంస్థలు పెద్ద మొత్తంలో దోచుకుంటున్నాయి. ఈ తతంగం అంతా ముంబై పోలీసుల పరిశోధనలో రట్టయింది.

పలువురు ప్రముఖులు తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి వుండటం మనం చూస్తుంటాం. అయితే కొందరు డాబు కోసం పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి ఫేక్ ఫాలోవర్స్ ను కొనుగోలు చేసుకుంటున్నట్టు ముంబై పోలీసులు తేల్చారు. నకిలీ అనుచరులను విక్రయించే ఈ సంస్థలపై దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు, ముంబై పోలీసులు నకిలీ ప్రొఫైల్ అమ్మిన 54 పోర్టల్లను గుర్తించారు. నకిలీ అనుచరులను విక్రయించే 100 పోర్టల్స్ గురించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నది. ఈ ప్రత్యేక బృందంలో ముంబై క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్ యూనిట్లు ఉన్నాయి. దీనికి డీసీపీ నంద్‌కుమార్ ఠాకూర్ నేతృత్వం వహిస్తున్నారు. 

ఒకేసారి వేలు, లక్షల్లో..

ముంబై పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం.. ఈ 54 పోర్టల్లకు అంతర్జాతీయ స్థావరం, కనెక్షన్లు ఉన్నాయి. వారు భారతీయ కరెన్సీలో కాకుండా అమెరికన్ డాలర్లలో మాత్రమే చెల్లింపులను అంగీకరిస్తారు. ఈ పోర్టల్స్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో నకిలీ అనుచరులను అందిస్తుంటాయి. ఒకేసారి వేలు, లక్షల్లో కూడా అందించేందుకు వీరు సిద్ధంగా ఉంటారు.

సిట్ గుర్తించిన 54 పోర్టల్లలో ఫాలోవర్స్ కార్ట్ ఒకటి. ఇది అంతర్జాతీయ సంస్థ. అరెస్టు చేసిన నిందితుడు ఈ కంపెనీకి మాత్రమే పునవిక్రేత. నిందితుడు కాలేజీ డ్రాపౌట్. గత ఏడాది ఎవరో థియా సంస్థ ద్వారా నకిలీ అనుచరులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని చెప్పగా విన్నానని, ఒక సంవత్సరంలో నకిలీ ఫాలోవర్స్ ను అమ్మడం ద్వారా 9,000 డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) సంపాదించినట్లు నిందితుడు వెల్లడించాడు. ఈ నిందితుడు ఇప్పటివరకు చాలా మంది దర్శకులు, కొరియోగ్రాఫర్లు, మేకప్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులకు నకిలీ ఫాలోవర్లను అమ్మినట్లు స్పష్టంచేశాడు.

భూమి త్రివేది అనే గాయకురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డొంకంతా కదిలింది. ముంబై పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు వీరు ఐదు లక్షల మంది నకిలీ అనుచరులను వేర్వేరు వ్యక్తులకు విక్రయించినట్లు ఒప్పుకున్నాడని సిట్ అధికారులు చెప్పారు. ఇలాంటి ఇతర పోర్టల్లపై కూడా దర్యాప్తు చేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది.


logo