ఆదివారం 31 మే 2020
National - May 21, 2020 , 13:37:00

ఆల్కహాల్‌ కోసం క్వారంటైన్‌లో బార్‌ డ్యాన్సర్ల ఆందోళన

ఆల్కహాల్‌ కోసం క్వారంటైన్‌లో బార్‌ డ్యాన్సర్ల ఆందోళన

లక్నో : ఆల్కహాల్‌ కోసం కొంతమంది బార్‌ డ్యాన్సర్లు.. క్వారంటైన్‌ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో చోటు చేసుకుంది. ఇటీవలే ముంబయి నుంచి 72 మంది మోర్దాబాద్‌కు వచ్చారు. వీరందరిని పోలీసులు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో మిగతా వారిని క్వారంటైన్‌లోనే ఉంచారు. 72 మందిలో 12 మంది పిల్లలు, 40 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నారు. 

అయితే మహిళల్లో కొంతమంది బార్‌ డ్యాన్సర్లు ఉన్నారు. తమకు ఆల్కహాల్‌ కావాలని హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ను బార్‌ డ్యాన్సర్లు డిమాండ్‌ చేశారు. మందు లేదని చెప్పేసరికి వారు క్వారంటైన్‌లోని కారిడార్‌లో డ్యాన్సులు చేస్తూ గందరగోళం సృష్టించారు. తమను ఇంటికి పంపించాలని ఆందోళనకు దిగారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. క్వారంటైన్‌ సమయం ముగిశాక కరోనా నెగిటివ్‌ అని తేలితేనే ఇంటికి పంపిస్తామని హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ వారికి చెప్పారు. 

మొత్తానికి బార్‌ డ్యాన్సర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక 72 మందిని ముంబయి నుంచి మోర్దాబాద్‌కు తరలించిన ట్రక్కు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే వారిని ట్రక్కు డ్రైవర్‌ మోర్దాబాద్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. చెక్‌పాయింట్‌ వద్ద ట్రక్కును ఆపలేదని పోలీసులు పేర్కొన్నారు.


logo