మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 08, 2020 , 17:11:19

ఎమ్మెల్యే కూతురుకు వ‌ర‌క‌ట్న వేధింపులు!

ఎమ్మెల్యే కూతురుకు వ‌ర‌క‌ట్న వేధింపులు!

భోపాల్: వ‌ర‌క‌ట్న వేధింపులు సామాన్యుల కుటుంబాల్లోనే కాదు పెద్ద‌పెద్ద రాజ‌కీయ నాయ‌కుల కుటుంబాల్లోనూ ఉంటాయ‌ని నిరూపించే ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం షియోపూర్ జిల్లాలో ఏకంగా ఓ ఎమ్మెల్యే కూతురు వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు గుర‌య్యింది. వివ‌రాల్లో వెళ్తే.. షియోపూర్ జిల్లాలోని విజ‌య్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసి త‌న‌ కుమార్తెను అదేజిల్లా కర‌హాల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌యాపూర్ వాసియైన సోను ఆదివాసికి ఇచ్చి ఐదేండ్ల క్రితం వివాహం చేశారు.

అయితే, మూడేండ్లపాటు స‌జావుగానే సాగిన వీరి కాపురంలో ఉన్న‌ట్టుండి క‌ల‌త‌లు చెల‌రేగాయి. గ‌త రెండేండ్లుగా సోను ఆదివాసి వ‌ర‌క‌ట్నం కోసం త‌న‌ భార్య‌ను వేధించ‌డం మొద‌లుపెట్టాడు. పుట్టింటి నుంచి ఖ‌రీదైన బైకు, ల‌క్ష‌ల్లో న‌గ‌దు తీసుకురావాల‌ని హింసిస్తున్నాడు. అందుకు ఆమె అత్త‌మామ‌లు, బావ, మ‌రుదులు కూడా వంత‌పాడారు. దీంతో బాధితురాలు ఈ విష‌యాన్ని ప‌లుమార్లు త‌న తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇలా గొడ‌వ జ‌రిగిన ప్ర‌తిసారి సీతారాం ఆదివాసి కూత‌రు ఇంటికి వెళ్లి అల్లుడికి స‌ర్దిచెప్పి వెళ్లేవాడు.

అయితే, నాలుగు నెల‌ల క్రితం ఎమ్మెల్యే సీతారాం అనారోగ్యానికి గురికావ‌డంతో కూతురు తండ్రిని చూసేందుకు వ‌చ్చింది. దాంతో క‌ట్నంతో వ‌స్తేనే తిరిగిరావాల‌ని, లేదంటే రావ‌ద్ద‌ని ఆమె భ‌ర్త తెగేసి చెప్పాడు. దీంతో నాలుగు నెల‌ల‌పాటు ఎదురుచూసిన బాధితురాలు అత్తింటి నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో వారిపై వ‌ర‌క‌ట్న వేధింపులు, గృహ‌హింస నేరాల కింద కేసులు పెట్టింది. త‌న ఫిర్యాదులో భ‌ర్త‌తోపాటు అత్త‌, మామ, బావ‌, మ‌రుదుల‌ను కూడా ప్ర‌తివాదులుగా చేర్చింది.       

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.