శనివారం 30 మే 2020
National - Mar 31, 2020 , 13:18:14

20 గంటలు.. 450 కి.మీ. నడిచిన పోలీసు

20 గంటలు.. 450 కి.మీ. నడిచిన పోలీసు

భోపాల్‌ : దేశానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఏది కూడా అడ్డంకిగా మారదు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సదుపాయం లేదు.. తాను విధులకు హాజరు కాలేకపోతున్నానని తమ ఉన్నతాధికారులకు నివేదిస్తారు. ఏవేవో అడ్డమైన సమాధానాలు చెబుతూ.. విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కానిస్టేబుల్‌ మాత్రం తన విధుల పట్ల చిత్తశుద్ధితో మెలిగాడు. 20 గంటల పాటు 400 కిలోమీటర్లు నడిచి విధులకు హాజరయ్యాడు పోలీసు. 

ఉత్తరప్రదేశ్‌ ఎతావాకు చెందిన దిగ్విజయ్‌ శర్మ(21)కు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌లో పోలీసు ఉద్యోగం వచ్చింది. జూన్‌ 1, 2018న మధ్యప్రదేశ్‌ పోలీసు ఫోర్స్‌లో చేరాడు. అయితే తాను దూర విద్యలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ చదువుతున్నాడు. మార్చి 16 నుంచి 23 వరకు బీఏ పరీక్షలు ఉండడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి ఎతావా వెళ్లాడు కానిస్టేబుల్‌. కరోనా వైరస్‌ కారణంగా యూపీలో అన్ని ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. అంతలోనే లాక్‌డౌన్‌ విధించారు. 

ఎగ్జామ్స్‌ వాయిదా పడటంతో.. విధులకు హాజరవుతానని దిగ్విజయ్‌.. ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. రవాణా సదుపాయం లేదు కాబట్టి.. ఇంటి దగ్గరే ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. కుటుంబ సభ్యులు కూడా విధులకు వెళ్లొద్దని వారించారు. అయినప్పటికీ తన మనసు మాత్రం విధులపైనే ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో దేశానికి సేవ చేయాలని అతను సంకల్పించాడు. దీంతో ఎతావా నుంచి మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌కు కాలినడకన బయల్దేరాడు. మార్గ మధ్యలో లిఫ్ట్‌ తీసుకున్నాడు. అలా 20 గంటల పాటు 450 కిలోమీటర్లు నడిచి శనివారం రాత్రి రాజ్‌గర్హ్‌కు చేరుకున్నాడు.

450 కిలోమీటర్లు నడిచి విధులకు హాజరైన కానిస్టేబుల్‌ దిగ్విజయ్‌పై రాజ్‌గర్హ్‌ ఎస్పీ ప్రదీప్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. విధుల పట్ట చిత్తశుద్ధితో ఉన్నాడని, దిగ్విజయ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ సూచించారు. 


logo