గ్రీన్ ‘ఇండియా’ ఛాలెంజ్

- టీఆర్ఎస్ నేత సంతోశ్‌కుమార్ ఛాలెంజ్‌కు దేశమంతా స్పందన
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఎంపీలు అసదుద్దీన్, శశిథరూర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ ప్రారంభించిన మూడోవిడత గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఉద్యమంలా కొనసాగుతున్నది. సినిమా, రాజకీయ రంగాలతోపాటు అన్నివర్గాల ప్రముఖులు ఇందులో భాగస్వాములవుతున్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దిన్ ఒవైసీ శనివారం హైదరాద్‌లోని తన నివాసంలో మెక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని ప్రశంసించారు. ఈ ఉద్యమంలో తనను భాగస్వామిని చేసింనందుకు సంతోశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సంతోశ్‌కుమార్ చేపట్టిన ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ స్వీకరించారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యయుత ఛాలెంజ్ తీసుకొని ఇండియాను గ్రీన్ ఇండియాగా మార్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత జైరాంరమేష్, బీజేపీ ఎంపీ జయంత్‌సిన్హా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్‌పాండా, అమృత్సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్లా, పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రాలకు శశిథరూర్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు. అసదుద్దీన్ ఒవైసీ, శశిథరూర్లకు సంతోశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.