సోమవారం 30 మార్చి 2020
National - Feb 27, 2020 , 03:27:50

పోలీసుల వైఫల్యమే!

పోలీసుల వైఫల్యమే!
  • ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదు
  • స్వతంత్రంగా పనిచేయండి
  • ఎవరి ఆదేశాల కోసమూ చూడొద్దు
  • ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు చీవాట్లు
  • విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆ ముగ్గురు
  • బీజేపీ నేతలపై చర్యలేవి?: ఢిల్లీకోర్టు
  • హస్తినలో 27కు పెరిగిన మృతులు
  • ఈశాన్య ఢిల్లీలో హింస తగ్గుముఖం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: అడుగడుగునా రాళ్లు, ఇటుకలు, గాజు ముక్కలు.. ధ్వంసమైన వాహనాలతో నిండిన రోడ్లు.. కాలిపోయిన దుకాణాలు, పొగచూరిన ఇండ్లు, ప్రార్థనా మందిరాలు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు. బోసిపోయిన వీధులు.. ప్రస్తు తం ఢిల్లీలో కనిపిస్తున్న విషాద దృశ్యాలివి. మూడు రోజులుగా కొనసాగుతున్న హింసతో దేశ రాజధాని విధ్వంసమైంది. చాంద్‌బాగ్‌, జఫ్రాబాద్‌, భజన్‌పురా, యమునావిహార్‌, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వీధులన్నీ విధ్వంసపు సాక్ష్యాలుగా మిగిలాయి. గోకుల్‌పురి సహా కొన్నిచోట్ల అల్లర్లు బుధవారం కూడా కొనసాగాయి. అల్లరిమూకలు స్వైరవిహారం చేశాయి. దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. కొన్ని దుకాణాలను లూఠీ చేశారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 18 కేసులు నమోదు చేశామని, 106 మందిని అరెస్ట్‌ చేశామని అదనపు పోలీస్‌ కమిషనర్‌ మన్‌దీప్‌సింగ్‌ తెలిపారు. భద్రతా బలగాలను భారీగా మోహరించడంతో ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దుకాణాలు, పాఠశాలలను మూసివేయించారు. ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన కుటుంబాలను సురక్షితంగా వారి బంధువుల ఇండ్లకు చేర్చారు. ఆయా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రోరైలు సంస్థ ప్రకటించింది. గురువా రం జరుగాల్సిన సీబీఎస్‌ఎస్‌ఈ 12వ తరగతి  ఇంగ్లిష్‌ పరీక్షను ఈశాన్య ఢిల్లీ పరిధిలో వాయి దా వేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 


కొనసాగుతున్న మరణాలు 

ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే ఓ పోలీస్‌ సహా 14 మంది దుర్మరణం చెందారు. దీంతో మృతుల సంఖ్య 27కు పెరిగింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని గురుతేజ్‌ బహదూర్‌ (జీటీబీ) హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ సునిల్‌ కుమార్‌ గౌతమ్‌ తెలిపారు. వారికి రాళ్లదెబ్బలతోపాటు తుపాకీ గాయాలు, ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు ఉన్నాయన్నారు. చాంద్‌బాగ్‌ ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ(26) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాళ్లదాడిలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెంది ఉంటాడన్నారు. 


శాంతి నెలకొనాలి: మోదీ 

ఢిల్లీ హింసపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ప్రజలంతా శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో నెలకొన్న పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించినట్టు చెప్పా రు. శాంతిభద్రతలు నెలకొనడం, పరిస్థితిని అదుపులోకి తేవడానికి తొలిప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, ఇతర బలగాలు, ఏజెన్సీలు కృషిచేస్తున్నాయన్నారు. 


సైన్యాన్ని దింపండి 

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు విఫలమయ్యారని, వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని కోరుతూ బుధవారం అమిత్‌షాకు లేఖ రాశారు. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రాళ్లదాడిలో మృతిచెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు. 


రంగంలోకి దోవల్‌ 

ఢిల్లీలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను కేంద్రం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు అప్పగించింది. ఆయన మంగళవారం అర్ధరాత్రి, బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘జరిగిందేదో జరిగింది. అల్లా దయతో.. త్వరలోనే ఈ ప్రాతంలోశాంతి నెలకొంటుంది’ అని వ్యాఖ్యానించారు. కొందరు నేరగాళ్లు మాత్రమే విధ్వంసం సృష్టిస్తున్నారని, వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. అనంతరం అమిత్‌షాను కలిసి పరిస్థితిని వివరించారు. 


logo