శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 17, 2020 , 18:15:54

నితీష్‌ రూపంలో దీదీకి మరో కొత్త చిక్కు!

నితీష్‌ రూపంలో దీదీకి మరో కొత్త చిక్కు!

కోల్‌కతా : మంత్రి పదవికి రాజీనామా చేయకుండా, క్యాబినెట్‌ మీటింగ్‌లకు రాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిప్పలు పెట్టిన సువేందు అధికారి తర్వాత.. మరో పది మంది  సీనియర్‌ నాయకులు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం మమతాకు మింగుడు పడటం లేదు. ఇదే సమయంలో నితీష్‌ కుమార్‌ రూపంలో మరో కొత్త చిక్కు కూడా వచ్చి పడింది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని  నితీష్‌ నిర్ణయించడమే మమతా బెనర్జీ తలనొప్పులకు కారణమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

జనతాదళ్ యునైటెడ్ (జేడీ (యు)) జాతీయ అధ్యక్షుడు, బిహార్‌ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రానున్న అసెంబ్లీ  ఎన్నికల్లో ఇబ్బందులను పెంచడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పోటీ చేసే 75 సీట్లను తన పార్టీ గుర్తించిందంట.  పశ్చిమ బెంగాల్‌లో జేడీ (యు) ప్రణాళిక వివరాలను తెలియజేస్తూ పార్టీ బెంగాల్ ఇన్‌చార్జి గులాం రసూల్ బలియావి మీడియాతో మాట్లాడారు. గత మూడేండ్లుగా పశ్చిమ బెంగాల్‌లో పనిచేస్తున్నామని, ఇప్పుడు ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. జేడీయూ బెంగాల్ యూనిట్ సిలిగురి, ముర్షిదాబాద్, మాల్డా, దినజ్‌పూర్, బంకురా, మేదినీపూర్, 24 పరగణ, నందిగ్రామ్‌ జిల్లాల్లోని 75 సీట్లను గుర్తించినట్లు గులాం రసూల్ బలియావి తెలిపారు. 

మిత్రపక్షమైన బీజేపీ తన శక్తితో బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నప్పటికీ.. బిహార్‌లో పొత్తు బెంగాల్ ఎన్నికల్లో పోరాడటానికి అడ్డురాదని జేడీయూ నేతలు భావిస్తున్నారు. ఇకడ ఫ్రెండ్లీ పోటీ ఉండే అవకాశాలను కొట్టిపారేయడం లేదు. తమకు అనుకూలంగా ఉన్న 75 స్థానాల్లో పోటీ చేసి పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని జేడీయూ తహతహలాడుతున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీతో తమ కూటమి బిహార్‌ వరకే  అని, ఇక్కడ మాత్రం పోటీదారులమని పలువురు పశ్చిమ బెంగాల్‌ జేడీయూ నేతలు కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో పోరాడిన తీరును గుర్తుచేస్తున్నారు. ఐక్యంగా పోరాడటం ద్వారా ఎన్డీఏ బలం పెంచుకోవచ్చని కూడావారు భావిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో తమ పార్టీ  బలపడేందుకు వీలు చిక్కుతుందని అనుకుంటున్నారు. బీజేపీ పాలనలో అరుణాచల్‌ప్రదేశ్‌లో జేడీ (యు) ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అదేవిధంగా గత ఏడాది బీజేపీ అధికారాన్ని కోల్పోయిన జార్ఖండ్‌లో జేడీయూ విడిగా పోటీ చేసింది. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలో పొత్తుపెట్టుకుని బరిలో నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌లో కాలుమోపేందుకు నితీష్‌ కుమార్‌ చూపుతున్న శ్రద్ధ.. అటు మమతాబెనర్జీకి, ఇటు కమ్యూనిస్టులకు తలనొప్పిగా మారుతుందనడంలో ఎలాంటి  అతిశయోక్తి లేదనే చెప్పాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo