బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:29

రాష్ర్టాల మార్కెట్లు రద్దవుతాయని ఆందోళన

రాష్ర్టాల మార్కెట్లు రద్దవుతాయని ఆందోళన

 • ఎమ్మెస్పీకి రక్షణ చట్టం కావాలని డిమాండ్‌
 • ‘గావ్‌ కనెక్షన్‌' సర్వేలో కీలక విషయాలు వెల్లడి
 • చట్టాలు వద్దన్న 52శాతం మంది అన్నదాతలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20: కేంద్ర ప్రభుత్వం గత నెలలో తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను దేశంలోని సగంమందికిపైగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ చట్టాల వల్ల రాష్ర్టాల్లో ఇప్పటికే ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు కనుమరుగవుతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ పంటలకు కనీస మద్దుతు ధర (ఎమ్మెస్పీ) కచ్చితంగా అందేలా చట్టం తేవాలని వారు కోరారు. ‘గావ్‌ కనెక్షన్‌ ఇన్‌సైట్స్‌' అనే సంస్థ అక్టోబర్‌ 3-9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేకోసం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 53 జిల్లాల్లో 5వేల మంది రైతులను ప్రశ్నించారు. 

సర్వేలోని ముఖ్యాంశాలు

 • ఇటీవల మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తారా అన్న ప్రశ్నకు 35 శాతం మంది అవును అని, 52 శాతం మంది కాదు అని, 13 శాతం మంది చెప్పలేమని సమాధానం చెప్పారు.
 • ఎమ్మెస్పీని తప్పనిసరి చేసే చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని 50 శాతం మంది చెప్పగా, అవసరం లేదని 16%, చెప్పలేమని 25 శాతం మంది రైతులు తెలిపారు. 
 • కేంద్ర చట్టాలతో రాష్ర్టాల్లోని మండీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అంతరించిపోతాయని 39 శాతం మంది రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వాటికేమీ నష్టం ఉండదని 27 శాతం అభిప్రాయపడ్డారు. 
 • రైతులు ఇప్పటికీ పంట ఉత్పత్తులను అమ్ముకోవటానికి వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలు (ఏపీఎంసీ)లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వ్యవసాయోత్పత్తుల విక్రయాల్లో ఏపీఎంసీలు- 36, ప్రైవేటు వ్యక్తులు-26, కార్పొరేట్‌ సంస్థలు-2 శాతం వాటా కలిగి ఉన్నాయి.
 • హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో అత్యధికంగా 78 శాతం మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ఏపీఎంఎస్‌లను ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల్లో అత్యధికంగా (77 శాతం) ఈ రాష్ర్టాలవారే ఉన్నారు.
 • ఈ చట్టాలతో ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు, దళారుల బెడద పెరుగుతుందని 38 శాతం మంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 
 • వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మోదీ సర్కారు రైతు పక్షపాతి అని 44 శాతం మంది అభిప్రాయపడటం విశేషం.  
 • అసోం, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల రైతుల్లో కేవలం 39శాతం మంది కేంద్ర చట్టాలను వ్యతిరేకించారు. పశ్చిమ రాష్ర్టాల్లో 48శాతం మంది రైతులు వ్యతిరేకించారు. అయితే, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ర్టాల్లో ఈ చట్టాలను 53.47 శాతం మంది రైతులు వ్యతిరేకించటం గమనార్హం.