ఆదివారం 17 జనవరి 2021
National - Dec 04, 2020 , 15:46:39

భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ...

భారత్ లో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువ...

ఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ బారిన పడిన మొత్తం జనాభాలో ఇంకా చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గురువారం వరకు చికిత్సలో ఉన్న బాధితుల శాతం 4.44 కాగా శుక్రవారం అది 4.35 శాతానికి తగ్గింది. ఈ ధోరణి గత వారం రోజులుగా కొనసాగుతున్నది. అంతేకాదు భారతదేశ వ్యాప్తంగా గత 24 గంటలలో కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 4,16,082 కు చేరింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తహా 36,595 మందికి కోవిడ్ సోకినట్టు తేలగా, 42,916 మంది కొత్తగా కోలుకున్నారు.  ఆ విధంగా ఈ తేడా అయిన  6,321 నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలకు దోహదం చేసినట్టయింది. 

ప్రతి పది లక్షలమంది జనాభాలో కోవిడ్ బారిన పడిన వారు భారత్ లో 6936 మందిగా నమోదుకాగా ఇది అంతర్జాతీయంగా చూస్తే చాలా తక్కువ. పశ్చిమార్థ గోళంలొని అనేక దేశాల్లో ఇది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. కోలుకున్నవారి శాతం మరింత మెరుగుపడి శుక్రవారం 94.2శాతం అయింది. ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య  90,16,289 కు చేరింది. కోలుకున్నవారికి, ఇంకా చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా పెరుగుతూ ప్రస్తుతం 86,00,207 కు చేరింది. కొత్తగా కోలుకున్న కేసులలో 80.19శాతం మంది పది రాష్ట్రాలకు చెందినవారున్నారు. అందులో మహారాష్టలో  అత్యధికంగా 8,066 మంది, కేరళలో 5,590 మంది, ఢిల్లీలో  4,834 మంది కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో75.76శాతం కేసులు 10 రాష్టాలలో నమోదు కాగా నిన్న కేరళలో కొత్తగా 5,376 కేసులు, మహారాష్టలో  5,182 కేసులు, ఢిల్లీలో 3,734 కేసులు తేలాయి. గడిచిన 24 గంటలలో 540 మరణాలు నమోదయ్యాయి. వాటిలో  77.78శాతం  కేవలం 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లొనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 115 మరణాలు నమోదు కాగా ఢిల్లీలో 82 మంది, పశ్చిమ బెంగాల్ లో 49 మంది చనిపోయినట్టు తేలింది. అంతర్జాతీయ పరంగా చూస్తే భారత్ లో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు అతి తక్కువగా 101 నమోదయ్యాయి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.