మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 09:39:57

నెరవేరిన మోడీ శపథం!

నెరవేరిన మోడీ శపథం!

అయోధ్య : అయోధ్య రామజన్మ భూమిలో ఆలయ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎన్నో ఆలయాలను సందర్శించిన మోడీ గత 29 ఏళ్లలో అయోధ్యలో పర్యటించలేదు. ఇందుకు 1991లో ఆయన చేసిన శపథమే కారణమని అయోధ్యకు చెందిన స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఒకరు పేర్కొన్నారు. 29 ఏళ్ల కిందట 1991లో రామ్‌లల్లా జన్మోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషితో కలిసి మోడీ అయోధ్యను సందర్శించారని ఫొటోగ్రాఫర్‌ మహేంద్ర త్రిపాఠి తెలిపారు. తాను ఆ సమయంలో వీహెచ్‌పీ కోసం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నానని పేర్కొన్నారు.

అప్పుడు కొంతమంది జర్నలిస్టులు సైతం ఉన్నారని, మురళీ మనోహర్ జోషి మోడీని బీజేపీ గుజరాత్‌ నాయకుడిగా విలేకరులకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు మరికొంత మంది జర్నలిస్టులు మోడీని అయోధ్యకు ఎప్పుడు తిరిగి వస్తారని అడిగితే.. ‘రామ్ మందిర్ నిర్మాణం ప్రారంభమైనప్పుడు నేను తిరిగి వస్తాను’ అని ఆయన సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. మోడీ తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని త్రిపాఠి అన్నారు. 1991లో బీజేపీ నేతగా అయోధ్యకు వెళ్లిన మోడీ నేడు ప్రధాని హోదాలో రామాలయ భూమిపూజకు హాజరవుతుండడం విశేషం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo