ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 16:22:09

మోదీ దిష్టిబొమ్మల దహనాన్ని చూసి ఆశ్చర్యపోయా : రాహుల్‌ గాంధీ

మోదీ దిష్టిబొమ్మల దహనాన్ని చూసి ఆశ్చర్యపోయా : రాహుల్‌ గాంధీ

పాట్నా : సాధారణంగా దసరా పండుగ రోజున రావణుడి దిష్టిబొమ్మలు కాలుతుంటాయని, ఈ సారి మాత్రం ప్రధాని మోదీ దిష్టిబొమ్మలు కాలిపోతుండడం చూసి ఆశ్చర్యపోయానని కాంగ్రెస్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ చంపారన్‌లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో నిరుద్యోగం, లాక్‌డౌన్‌, వ్యవసాయ చట్టాలు, డీమోనిటైజేషన్‌ సమయంలో వలస కార్మికుల దుస్థితిపై మరోసారి ప్రధాని, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ దేశ ప్రధాని అని, ఆయన దిష్టిబొమ్మల దహనం విచారకరమని, ఇలాంటివి జరగకూడదన్నారు.

మోదీ చివరిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని, మీ అందరితో టీ తాగుతామని హామీ ఇచ్చారు.. మీకు గుర్తుందా? మీతో టీ తాగాడా?’ అని స్థానికులకు గుర్తు చేశారు. బిహార్‌లో నిరుద్యోగంపై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి లేనందున బిహార్‌ నుంచి ప్రజలు ఇతర నగరాలకు వలస వెళాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాలి? అని, ఎప్పుడైనా ఆలోచించారా? అని అన్నారు. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఇప్పుడు ఎందుకు ప్రసంగాల్లో చెప్పడం లేదని ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో కార్మికుల కోసం ప్రధాని ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు, రైతులను నాశనం చేసి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు డీమోనిటైజేషన్‌ చేశారని ఆరోపించారు. తేజస్వియాదవ్‌ కొత్త ఒరవడితో ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దేశానికి నిర్దేశం చేసిందని, జాతీయ ఉపాధిహామీ పథకం తీసుకువచ్చామని, రైతుల రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. దేశాన్ని ఎలా నడిపించాలో.. రైతులతో కలిసి నిలబడడం, ఉపాధిని ఎలా సంపాదించాలో మాకు తెలుసునని, కానీ మాకు ఒక్కటి అబద్ధాలాడడం మాత్రం తెలియదని, ఈ విషయంలో ప్రధానితో పోటీపడలేమనన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.