శుక్రవారం 03 జూలై 2020
National - Apr 04, 2020 , 02:29:34

సంకల్పజ్యోతి వెలిగిద్దాం!

సంకల్పజ్యోతి వెలిగిద్దాం!

-కరోనాపై పోరులో సమిష్టి శక్తిని చాటుదాం.. 

-దేశ ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం

-రేపు రాత్రి 9 గంటలకు లైట్లన్నీ బంద్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని సూచన

-ప్రధానమంత్రి మోదీ పిలుపును పాటిద్దాం.. 

-రాష్ట్ర ప్రజలను కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సమిష్టిపోరు సాగిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 5న (ఆదివారం) రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ తమ ఇండ్లలోని లైట్లను ఆర్పివేసి కొవ్వొత్తులు, దీపాలు లేదా మొబైల్‌ టార్చ్‌లైట్లను 9 నిమిషాలపాటు వెలిగించాలని కోరారు. తద్వారా కరోనాను ఓడించడంలో దేశ ‘సమిష్టి సంకల్పాన్ని’ చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ‘లక్ష్మణ రేఖ’ను దాటొద్దని, ప్రజలందరూ ఇంట్లోనే ఉండి, నిర్ణీత దూరం పాటించాలని కోరారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. 

చీకటి నుంచి వెలుతురువైపు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్న కారణంగా చాలామంది ఒంటరితనంగా భావించొచ్చని, అయితే 130 కోట్ల మంది సమిష్టిశక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నదన్న విషయాన్ని వారు గుర్తించాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఉమ్మడి శక్తి ‘గొప్పతనం, మహత్వం, దివ్యత్వాన్ని’ దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలందరూ ఒక్కసారిగా లైట్లను ఆర్పివేసి కొవ్వొత్తులు, మొబైల్‌లోని టార్చ్‌లైట్లను వెలిగించినప్పుడు.. ‘మనమందరం సమిష్టిగా పోరాడుతున్నామన్న’ భావన ఆ దివ్య వెలుగులో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘మనం ఒంటరికాదు, ఎవరూ ఏకాకి కాదు’ అని ఆ వెలుగు ద్వారా మనం సంకల్పించుకోవాలని సూచించారు.  తీవ్రంగా ప్రభావితమైన పేదలను ఆదుకోవాలని, కరోనా చిమ్మిన ఈ చీకట్లతో నిరాశలో మునిగిపోయిన వారిని ఆశ అనే వెలుతురువైపు నడిపించాలని కోరారు. అలాగే ఈ సంక్షోభం మిగిల్చిన చీకటి, అనిశ్చితికి ముగింపు పలికి స్థిరత్వం, వెలుతురువైపు మనం పురోగమించాలని సూచించారు. మన సంకల్ప శక్తికి మించినది ప్రపంచంలో ఏదీ లేదంటూ సంస్కృత శ్లోకాన్ని ఆయన ఉటంకించారు. లాక్‌డౌన్‌కు సందర్భంగా ప్రజలు చూపిన అసాధారణ క్రమశిక్షణ, సేవా దృక్పథానికి ఆయన కృజ్ఞతలు తెలిపారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలంతా వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన విధానం చాలా దేశాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు.

ప్రధాన్‌ షోమ్యాన్‌: కాంగ్రెస్‌

ప్రధాని సందేశంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ‘ప్రధాన్‌ షోమ్యాన్‌' అంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఎద్దేవాచేశారు. ‘హిందూయిజంలో నంబర్‌ 9తో ముడిపడిన పవిత్ర అంశాలను ప్రధాని ప్రస్తావించారు. తిరిగి రామ్‌భరోస్‌వైపు’ అని ట్వీట్‌చేశారు. ‘డియర్‌ పీఎం మోదీ, మేం మీ మాట విని ఏప్రిల్‌ 5న కొవ్వొత్తులు వెలిగిస్తాం. అలాగే మీరు కూడా, మా మాటలు, శాస్త్రజ్ఞులు, ఆర్థిక వేత్తల మాటలు వినండి’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు. ప్రధాని సందేశం ప్రజలను నిరాశపరిచిందని ఎన్సీపీ అభిప్రాయపడింది. 

చార్లెస్‌, నెతన్యాహూకు మోదీ ఫోన్‌

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు.  ఆయుర్వేద వైద్య చికిత్స పొందుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న నెతన్యాహూకు సైతం మోదీ ఫోన్‌ చేసి, ఆరోగ్యం గురించి ఆరాతీశారు. 

నిధులు అవసరం: సీపీఐ, న్యూడెమోక్రసీ

కరోనాపై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక భరోసాను కల్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కేంద్రం రూ.7.35 లక్షల కోట్లు విడుదలచేసి  ఆదుకోవాలని కోరారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధులు, వైద్య పరికరాలు, మందులు పంపిణీచేయాలని న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు కే గోవర్ధన్‌ డిమాండ్‌చేశారు.

నేడు ఫోల్డ్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెల 5న దేశ ప్రజలందరూ 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పివేస్తే విద్యుత్‌ గ్రిడ్‌పై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోరం ఫర్‌ లోడ్‌ డిస్పాచెస్‌ (ఫోల్డ్‌) సంస్థ శనివారం ఉదయం 11.30 గంటలకు అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే తెలంగాణ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నుంచి అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 

ప్రధాని పిలుపును పాటిద్దాం:రాష్ట్ర ప్రజలను కోరిన సీఎం కేసీఆర్‌

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తున్న గొప్ప పోరాటం.. స్ఫూర్తిమంతంగా సాగాలని ముఖ్యమంత్రి అభిలషించారు.logo