మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 01:10:10

నేడు మోదీ-ట్రంప్‌ చర్చలు

నేడు మోదీ-ట్రంప్‌ చర్చలు
  • అంతర్జాతీయ భాగస్వామ్య విస్తరణే లక్ష్యం
  • వాణిజ్య ఒప్పందంపై సంతకాలు అనుమానమే

న్యూఢిల్లీ: భారత్‌-అమెరికా మధ్య అంతర్జాతీ య భాగస్వామ్యం విస్తరణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం చర్చిస్తారు. భారత్‌లో తొలిసారి అధికారిక పర్యటనకొచ్చిన ట్రంప్‌తో మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చిస్తారు. అయితే, వీరి చర్చ ల్లో రెండు దేశాల మధ్య వివిధ వస్తువులపై విధిస్తున్న దిగుమతి సుంకాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ట్రంప్‌ ఇటీవల గుర్తు చేయడం గమనార్హం. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు, రక్షణ, భద్రత, ఉగ్రవాద నిరోధం, హెచ్‌1 బీ, ఇంధన భద్రత, మతస్వేచ్ఛ, ఆఫ్ఘన్‌లో తాలిబన్లతో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులపై  చర్చిస్తారు.  ట్రంప్‌ పర్యటనలో భాగంగా భారత్‌కు 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్‌-64ఈ అపాచీ హెలికాప్టర్ల సరఫరా, 300 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ హెలికాప్టర్లతోపాటు భారత సైన్యానికి అవసరమైన ఇతర పరికరాల సరఫరా కాంట్రాక్టు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారు.  


నా ప్రత్యర్థి బెర్నీ సాండర్సే: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ తరఫున పడనున్న ట్రంప్‌.. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా సెనెటర్‌ బెర్నీ సాండర్స్‌ నిలిచే అవకాశం ఉందని సూచన ప్రాయంగా చెప్పారు. సోమవారం ఆగ్రాకు వెళుతూ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 


హోటల్‌ మౌర్యలో ట్రంప్‌ బస

ట్రంప్‌ కుటుంబం అహ్మదాబాద్‌, ఆగ్రా సందర్శన తర్వాత సోమవారం సాయం త్రం ఢిల్లీకి చేరుకున్నది. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తదితరులు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. తర్వాత ట్రంప్‌ బృందం హోటల్‌ మౌర్యకు చేరుకుంది. వీరి బస కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ట్రంప్‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద స్వాగతం పలుకుతారు. తర్వాత ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అటుపై హైదరాబాద్‌ హౌజ్‌లో ట్రంప్‌, మోదీ కీలక చర్చలు జరుపుతారు. సాయంత్రం రాష్ట్రపతి కోవింద్‌ ట్రంప్‌ గౌరవార్ధం విందు ఇస్తారు. దీంతో ట్రంప్‌ భారత పర్యటన ముగుస్తుంది. 


logo
>>>>>>