శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 03:34:23

కరోనా జాగ్రత్తలతో పంద్రాగస్టు

కరోనా జాగ్రత్తలతో పంద్రాగస్టు

  • ఎర్రకోటలో జెండాను ఎగురవేయనున్నప్రధాని మోదీ
  • భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు 
  • అందుబాటులో శానిటైజర్లు 
  • నాలుగు వేల మందికి ఆహ్వానం 

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద శనివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, చైనాతో ఉద్రిక్తతలు, స్వావలంబన ప్రయత్నాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. కిందటిసారి ప్రసంగంలో ఆయన జనాభా నియంత్రణ అవశ్యకతను కీలకంగా ప్రస్తావించారు. ఈసారి ఆ అంశంపై ఏదైనా ప్రకటన చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు రక్షణ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకలకు అధికారులు, మీడియా ప్రతినిధులు సహా 4వేల మందికి పైగా ఆహ్వానం పంపినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్టు శుక్రవారం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కోరింది. ఉత్సవాల సమయంలో పలు చోట్ల హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్‌ కమాండోలతో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

దాడికి దిగితే బుద్ధి చెబుతాం: రాజ్‌నాథ్‌

ఏదైనా శత్రుదేశం భారత్‌పై దాడులకు దిగితే తగిన బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా దళాలకు ఆయన శుక్రవారం సందేశాన్ని ఇచ్చారు. ‘భారత్‌ ఎప్పుడు కూడా ఏ దేశంపైనా దాడులకు పాల్పడలేదు. ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించలేదు. కానీ భారత్‌పై శత్రుదేశం దాడులకు పాల్పడితే మాత్రం చూస్తు ఊరుకోం. తగిన బుద్ధి చెబుతాం’ అని తెలిపారు. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకొనే జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, కావాలని ఇతర దేశాలపై దాడులు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని చెప్పారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘శ్రీజన్‌'ను రాజ్‌నాథ్‌ ప్రారంభించారు.


logo