బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 02:43:24

సోషల్‌ మీడియాకు ‘నై’

సోషల్‌ మీడియాకు ‘నై’
  • బెదిరింపులు, దూషణల నేపథ్యంలో..సామాజిక మాధ్యమాలకు దూరమవుతున్న ప్రముఖులు
  • ఇష్టంలేక దాని జోలికిపోని మరికొందరు..
  • జాబితాలో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు

నేషనల్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. వచ్చే ఆదివారం వాటి నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొనడం చర్చనీయాంశం అయింది. సోషల్‌ మీడియాకు దూరం కావొద్దంటూ వేలాది మంది నెటిజన్లు మోదీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు, ప్రధాని నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘సోషల్‌ మీడియాను కాదు.. విద్వేషాన్ని వదిలేయాలి’ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీపై విరుచుకుపడగా.. దేశంలో సోషల్‌ మీడియాను నిషేధించాలన్న ఉద్దేశంతోనే ముందస్తుగా మోదీ ఈ హెచ్చరిక చేసి ఉంటారని మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు. అయితే, ‘ఆదివారం రోజు.. మహి ళా దినోత్సవం. మనకు స్ఫూర్తినిస్తున్న మహిళలకు నేను నా సోషల్‌ మీడియా అకౌంట్లను అప్పగిస్తా’ అంటూ మోదీ మంగళవారం మరో ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాకు వివిధ కారణాలతో దూరమైనవాళ్లు, అసలు సోషల్‌ మీడియానే ఉపయోగించని ప్రముఖుల గురించి ఆసక్తికర వివరాలు.


అనలిటికాతో దూరం 

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి, ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలని తీర్పు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణను(బ్రెగ్జిట్‌కు).. ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ అనే సంస్థ ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని వినియోగించుకుని ‘ప్రభావితం చేసింద’న్న ఆరోపణల నేపథ్యంలో ‘స్పేస్‌ ఎక్స్‌' సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌, బాలీవుడ్‌ దర్శకుడు ఫరాన్‌ అక్తర్‌ తమ ఫేస్‌బుక్‌ ఖాతాల్ని నిలిపివేశారు. ఫేస్‌బుక్‌ నియంతృత్వంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వాళ్లు తమ ఖాతాల్ని నిలిపేశారు. 


ఒక్క ఫొటోతో.. 

2018లో గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆ విగ్రహం కాలి దగ్గర మోదీ నిల్చున్న ఫొటోను ఉద్దేశిస్తూ.. ‘అది ప్రధానేనా, పక్షి రెట్టా?’ అంటూ కన్నడ నటి, కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా సెల్‌ హెడ్‌ దివ్య స్పందన వివాదాస్పదమైన ట్వీట్‌ చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా సోషల్‌ మీడియాకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. 


అది నాకోసం కాదు.. 

తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆరంభంలో ఫేస్‌బుక్‌ వాడాలని ఎంతో ఉత్సాహాన్ని చూపానని, ఆ మాధ్యమం తన కోసం కాదన్నవిషయం ఆ తర్వాత అర్థమైందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


ఫోన్‌ కూడా లేదు  


రక్షణ దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సోషల్‌మీడియాకు దూరంగా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సోషల్‌మీడియాతోపాటు తాను మొబైల్‌ను కూడా వాడనన్నారు. ఎవరైనా ఫోన్‌ నంబర్‌ అడిగితే.. గుర్తొచ్చిన నంబర్‌ చెప్తానని సరదాగా చెప్పారు.


అధికారిక ఖాతా లేదు 


కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఖాతాలు లేవు. పార్టీకి సంబంధించిన ప్రకటనల్ని పార్టీ అధికారిక ఖాతా ద్వారానే వెల్లడించేందుకు ఇష్టపడే ఆమె.. పార్టీ కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడటమే తనకు ఇష్టంగా చెబుతారు. 


బెదిరింపులతో.. 


కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన వైఖరిని కుండబద్దలు కొట్టేలా చెప్పే వ్యక్తుల్లో ఒకరైన బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నట్టు గతేడాది ప్రకటించారు. ఒక వర్గం బెదిరింపులతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.


ట్రోలింగ్‌ భరించలేక.. 


రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై తాను చేస్తున్న విశ్లేషణలపై ఒక వర్గం ఎదురు దాడులకు దిగడం, ట్రోలింగ్‌ చేస్తూ దూషణలకు పాల్పడటంతో ట్విట్టర్‌ నుంచి నిష్ర్కమిస్తున్నట్టు కాంగ్రెస్‌ నాయకురాలు, నటి ఖుష్బూ ప్రకటించారు. గతేడాది నవంబర్‌లో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 


logo