గురువారం 09 జూలై 2020
National - Apr 17, 2020 , 08:40:25

‘యూపీ మోడల్‌'పై ప్రశంసలు!

‘యూపీ మోడల్‌'పై ప్రశంసలు!

లక్నో: కరోనాని ఎదుర్కోవడంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రశంసలను అందుకుంటున్నది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, బాధితులకు చికిత్స, పేద ప్రజల ఆర్థిక కష్టాలను తీర్చడంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ సమర్థంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా యూపీ సర్కారును అభినందించారు. మిగతా రాష్ర్టాలు కూడా ‘యూపీ మోడల్‌'ను అనుసరించాలని సూచించారు. కరోనా హాట్‌స్పాట్‌లను గుర్తించే విధానాన్ని దేశంలో మొదటిసారి యూపీనే అవలంబించింది. ఆరు కంటే ఎక్కువ కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి, ఆ ప్రాంతాలకు రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇంటికే చేర్చింది. కరోనా ఆంక్షలతో తీవ్రంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చింది. 12.25 లక్షల భవన నిర్మాణ కార్మికులతోపాటు వీధి వ్యాపారులకు, రిక్షా కార్మికులకు, కాంట్రాక్ట్‌ కార్మికులకు, ఉపాధి కార్మికులకు రూ.1000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమచేసింది.


logo