బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 02:46:58

భ్రమలే ఓడించాయి!

భ్రమలే ఓడించాయి!
  • ఫలించని హిందూ ఓటర్ల ఏకీకరణ వ్యూహం
  • నేతల విద్వేష ప్రసంగాలూ వ్యతిరేకతను పెంచాయి
  • బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలివే..

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణం.. ఆ పార్టీ అనుసరించిన ‘నెగిటివ్‌ వ్యూహమే’నని విశ్లేషకులు అంటున్నారు. ఆప్‌ దూకుడును అడ్డుకునేందుకు బీజేపీ.. హిందూ ఓటర్లను ఏకీకరణ చేసి ఓట్లు పొందాలని ప్రయత్నించింది. దేశద్రోహులను కాల్చివేయాలని.. ఈ ఎన్నికలు భారత్‌కు, పాకిస్థాన్‌కు మధ్యే పోటీ అని.. సీఎం కేజ్రీవాల్‌ ఉగ్రవాది అని బీజేపీ నేతలు ‘లక్ష్మణ రేఖ’ దాటి విపరీత వ్యాఖ్యలు చేశారు. హిందూ ఓట్లను లక్ష్యంగా చేసుకునే బీజేపీ ప్రచారం నిర్వహించింది. అయితే ఢిల్లీలో దాదాపు 80% ఉన్న హిందువులు ఆప్‌కే పట్టం కట్టారు. ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టారు.   


2014 నుంచి ఎన్నికల్లో విజయానికి మోదీ, షా సారథ్యంలో బీజేపీ ఒక సక్సెస్‌ఫుల్‌ ఫార్ములాను రూపొందించింది. అయితే అన్నిసార్లు దాన్నే అనుసరించడం వల్ల పార్టీ వద్ద ప్లాన్‌-బీ అంటూ లేకుండాపోయింది. హిందుత్వ అజెండా, పాక్‌ వ్యతిరేక ప్రసంగాలు, మోదీతో ప్రచారం, జాతి వ్యతిరేకులంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడడం, నియోజకవర్గాల్లో వీఐపీ నేతలతో ప్రచారం నిర్వహించడం వంటివి బీజేపీ ఎన్నికల విధానంలో భాగం. 2014 నుంచి చాలా ఎన్నికల్లో అది విజయవంతమైంది. అదే సమయంలో, ఇది బీజేపీలో మార్పు లేకుండా చేసింది. అదే ఆ పార్టీని ఢిల్లీలో దెబ్బతీసింది. కేజ్రీవాల్‌ రూపంలో ఢిల్లీలో బలమైన ముఖ్యమంత్రి ఉన్నారు. బీజేపీ హిందూ ప్రచారానికి దీటుగా ఆయన తనది విద్వేషం లేని హిందూ మార్గమని చెప్పుకున్నారు. ఓటర్లను ఆకట్టుకున్నారు. 


 గత అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ ఓటమి తర్వాత అరవింద్‌ కేజ్రీవాల్‌కు పోటీగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కూడా బీజేపీ ప్రయత్నించలేదు. మనోజ్‌ తివారీని పార్టీ ఢిల్లీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. పైగా మధ్యతరగతి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న కేజ్రీవాల్‌కు తివారీ దీటైన ప్రత్యర్థి కాదు.  

ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమం మళ్లీ పుంజుకుంటుందన్న భయాందోళనల నేపథ్యంలో 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించేందుకు బీజేపీ తమ ఓట్లను కొన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లించింది. అయితే దీన్ని అమలుచేయడంలో బీజేపీ విఫలమైంది. మరోవైపు కాంగ్రెస్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 


logo