శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 14:49:05

మోదీజీ.. బీహారీలకు అబద్ధాలు చెప్పొద్దు: రాహుల్‌

మోదీజీ.. బీహారీలకు అబద్ధాలు చెప్పొద్దు: రాహుల్‌

పాట్నా: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. హిసువా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, వలస కార్మికుల సమస్యలు, సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు వంటి అంశాలపై రాహుల్‌ గాంధీ మాట్లాడారు. మోదీజీ.. బీహారీలకు అబద్ధాలు చెప్పొద్దు.. బీహారీలకు ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఒక్కరికి కూడా రాలేదని విమర్శించారు. జవాన్లు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారవేత్తల ముందు తల దించుతానని మోదీ బహిరంగంగా చెబుతారని, అయితే ఇంటికి వెళ్లాక అంబానీ, అదానీ కోసమే ఆయన పని చేస్తారంటూ రాహుల్‌ మండిపడ్డారు. రైతులపై దాడి కోసం మోదీ ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. మొదట మండీలు, కనీస మద్దతు ధరను బీహార్‌లో తొలగించారని, ఇప్పుడు వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని, ఎంతో మందిని నిరుద్యోగులుగా మార్చుతున్నారని ఆరోపించారు. 

కరోనా నేపథ్యంలో ఆకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించి వలస కార్మికులందరినీ బీహార్‌కు పంపారని రాహుల్‌ విమర్శించారు. వలస కూలీలంతా రోడ్లపై వందల కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు మోదీ ఏం చేస్తున్నారు? మీకు రైళ్లు ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. బీహార్‌ అమర జవాన్లను విపక్షాలు అవమానిస్తున్నాయన్న మోదీ వ్యాఖ్యలను రాహుల్‌ ఖండించారు. బీహార్‌ జవాన్లు ఎప్పుడు అమరులయ్యారు, అప్పుడు ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. చైనా సైన్యం భారత్‌ భూ భాగంలోకి వచ్చినప్పుడు మోదీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అమర జవాన్ల త్యాగాలకు తల వంచుతున్నానని అంటున్నారు. ఎందుకు ఈ అబద్ధాలు అంటూ మోడీపై రాహుల్‌  విమర్శించారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారంటూ మండిపడ్డారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.