గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 02:15:16

కరోనా కట్టడికి సార్క్‌ ఫండ్‌

కరోనా కట్టడికి సార్క్‌ ఫండ్‌
  • ప్రతిపాదించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ
  • భారత్‌ తరఫున రూ.74 కోట్లు ప్రకటన
  • సార్క్‌ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై సార్క్‌ కూటమి దేశాలు కలిసి పోరాటం సాగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అలాగే వైరస్‌ కట్టడికి ‘ఎమర్జెన్సీ ఫండ్‌' ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇందుకోసం భారత్‌ మొదటగా 10 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.74 కోట్లు) అందజేయనున్నట్లు చెప్పారు. వైరస్‌పై పోరుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సార్క్‌ దేశాధినేతలతో ఆదివారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఇందులో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్‌ సోలీ, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, పాక్‌ ప్రధాని స్పెషల్‌ అసిస్టెంట్‌ జాఫర్‌ మీర్జా పాల్గొన్నారు. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు పాక్‌ ఈ వేదికను ఉపయోగించుకున్నది. కశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.

అవసరమైతే ర్యాపిడ్‌ టీమ్‌ను పంపిస్తాం..

వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనాను నియంత్రించడంలో సార్క్‌ సభ్య దేశాలు ఏకతాటిపైకి రావాలని నొక్కిచెప్పారు. ‘కొవిడ్‌-19 ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నా. దీనికి సభ్యదేశాలన్నీ స్వచ్ఛందంగా నిధులు అందించవచ్చు. ఈ నిధికి భారత్‌ మొదటగా రూ.74 కోట్లు అందజేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘డాక్టర్లు, నిపుణులతో మేం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటుచేస్తున్నాం. వీరు ‘స్టాండ్‌ బై’గా ఉంటారు. అవసరమైతే, మీకు పంపుతాం’ అని సార్క్‌ దేశాధినేతలకు తెలిపారు. వైరస్‌ బాధితులతోపాటు వారు కలిసిన వ్యక్తులను గుర్తించేందుకు భారత్‌ ‘ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైవలెన్స్‌ పోర్టల్‌'ను రూపొందించిందని, ఈ సాఫ్ట్‌వేర్‌ను సభ్యదేశాలకు భారత్‌ అందజేస్తుందని చెప్పారు.

కేసులు తక్కువే అయినా.. అప్రమత్తంగా ఉందాం..

ప్రధాని మాట్లాడుతూ.. ‘దక్షిణాసియా ప్రాంతంలో కరోనా కేసులు 150 కంటే తక్కువే నమోదైనా అప్రమత్తంగా ఉండాలి. ‘సిద్ధమవడం.. భయపడకపోవడమే’ కరోనాను కట్టడిలో భారత్‌ అనుసరిస్తున్న మంత్రం. భారత్‌కు వచ్చే వారికి జనవరి మధ్య నుంచే స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాం. ప్రయాణాలపై క్రమంగా ఆంక్షలు విధించాం. వివిధ దేశాల నుంచి సుమారు 1400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం’ అని చెప్పారు.


logo
>>>>>>