సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 13:15:45

మోడెర్నా టీకా అద్భుతం: ఆంటోనీ ఫౌసీ

మోడెర్నా టీకా అద్భుతం: ఆంటోనీ ఫౌసీ

వాషింగ్ట‌న్‌: క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేడ‌యం కోసం మోడెర్నా రూపొందించిన టీకా ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీకా పనితీరు తనను అద్భుతంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కాగా, టీకా కోసం ఎదురుచూస్తున్న‌ ప్రపంచానికి సోమవారం మోడెర్నా శుభవార్త చెప్పింది. తాము రూపొందించిన టీకా మొదటి విశ్లేషణలో 94.5 శాతం సమర్థతను చూపినట్లు వెల్లడించింది.

‌మోడెర్నా టీకా ప‌నితీరుతో తాను 70 శాతం నుంచి ఎక్కువలో ఎక్కువ 75 శాతం సంతృప్తి చెందాన‌ని ఆంటోనీ ఫౌసీ పేర్కొన్నారు. మన దగ్గర 94.5 శాతం సమర్థతతో పనిచేసే టీకా ఉందనే విషయం అద్భుతంగా ఉందని, ఇది నిజంగా గొప్ప ఫలితమ‌ని ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఇంత బాగా పనిచేసే టీకా లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయ‌ప‌డ్డారు. చైనా కరోనా వైరస్ జన్యుక్రమాన్ని అందజేసిన వెంటనే జనవరిలో ఫౌసీ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, యూఎస్‌ బయోటెక్ సంస్థతో కలిసి టీకా అభివృద్ధిని చేపట్టింది. 

ఈ వ్యాక్సిన్‌లో ఎంఆర్‌ఎన్‌ఏ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు. ఈ స‌రికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై తాము ఇప్ప‌టివ‌ర‌కు చాలా విమర్శలు ఎదుర్కొన్నామని ఫౌసీ తెలిపారు. ఇక తాము నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని, తాజాగా వెలువడిన ఫ‌లితాలే విమ‌ర్శ‌కుల‌కు స‌మాధాన‌మ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.