శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 14:04:59

రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు!

రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు!

హైద‌రాబాద్‌: రుతుపవనాలు, తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం నుంచి హైదరాబాద్ న‌గ‌రంతోపాటు వివిధ‌ జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణలో రాగ‌ల‌ 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక‌ రాబోయే మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. 

ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రాత్రికి ఉత్తర ఛత్తీస్‌గ‌ఢ్‌‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. 

ఆ అల్ప‌పీడ‌నానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న‌ది. మధ్య తమిళనాడు పరిసరాల్లో 7.6 కి.మీ. ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆదివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షా లు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo